AP Elder Pensioners: మా పింఛన్ల ముందు ఆ బటన్లెంత
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:23 AM
ఏసీ గదుల్లో కూర్చోకుండా నేనే ముందుండి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. బటన్ నొక్కే పాలన కాదు, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడమే నిజమైన సేవ అని అన్నారు

పంపిణీ తొలిరోజే 98 శాతం మందికి లబ్ధి
ప్రజలే ఫస్ట్.. ఆ తర్వాతే మిగిలినవన్నీ
2029 కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యం
తలసరి ఆదాయం 5.2 లక్షలకు చేరుస్తా
పీ4ను విమర్శిస్తే సహించేది లేదు
జూన్ చివరికల్లా భారీగా టీచర్ పోస్టుల భర్తీ
సంకల్పమున్నా ఒక్క రోజులో అన్నీకావు
బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ, పీ 4 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని పునర్నిర్మించేవరకు విశ్రమించను: సీఎం
బాపట్ల/పర్చూరు(చీరాల), ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : ‘‘గతంలో బటన్లు నొక్కి దానినే ఘనతగా చెప్పుకొనేవారు. ఆ బటన్లేవీ మేం ఇప్పుడు ఇస్తున్న పింఛన్లకు సరితూగవు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెలలో మొదటి తేదీనే ఇంటింటికి వెళ్లి 98 శాతం పింఛన్లు పంపిణీ చేయగలుగుతున్నామని, ఇందుకు అఽధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించే వరకు విశ్రమించేది లేదని స్పష్టంచేశారు. మంగళవారం బాపట్ల జిల్లా చినగంజాం మండల పరిధిలోని కొత్తగొల్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీలోను, పీ 4 లబ్ధిదారులతో జరిగిన కార్యక్రమంలోను పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజావేదికలో స్థానికులతో సీఎం మాట్లాడారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. ‘నేను అమరావతిలో ఏసీ రూంలో కూర్చుంటే నేతలు కూడా బద్దకిస్తారు. అందుకే నేనే ముందుండి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నాను. సైన్యాధిపతి ముందుంటేనే విజయం వరిస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. పింఛన్ల పంపిణీకి కొత్తగొల్లపాలెం గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం ఉందని తెలిపారు. ‘‘ఈ గ్రామంలో ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీయే గెలిచింది. మొత్తం జనాభాలో 95 శాతం యాదవ సామాజిక వర్గం ఉంది. వీరు మా పార్టీకి ఆది నుంచీ అండగా ఉంటున్నారు.
అందుకే ఈ గ్రామాన్ని ఎంచుకున్నా. నాకు ప్రజలే ముందు...ఆ తర్వాతే మిగిలినవన్నీ’’ అని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో భాగంలో దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి, వితంతువు బత్తుల జాలమ్మ ఇళ్లకు వెళ్లి పింఛన్ అందించారు. అనంతరం గ్రామంలోని దేవాలయాన్ని సందర్శించిన పెద్దగొల్ల పూజారి ఆశీస్సులు తీసుకున్నారు. ఊరి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
పేదల ఎదుగుదలకు అడ్డొస్తే సహించను
‘‘పింఛన్లు అందించడానికి గ్రామంలో ఇద్దరి ఇళ్లకు వెళ్లా. వారిలో ఒకరు మంచంలో ఉన్నారు. మరొకరు కుటుంబానికి ఆధారమైన పెద్ద దిక్కును కోల్పోయారు. వారి కష్టాలు కదిలించాయి. వెంటనే ప్రభుత్వం వైపు నుంచి వారికి అందే అన్ని పథకాలను వెంటనే ఇవ్వాలని ఆదేశించా. ఆ కుటుంబాలకు పింఛనే ఆధారం. మానవత్వంతో ఆలోచించి పింఛన్ సొమ్ము పెంపు నిర్ణయాన్ని తీసుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పెరిగిన పింఛన్లు అందుతున్నాయి. పేదరిక నిర్మూలనలో భాగంగానే పింఛన్ సొమ్మును పెంచి అందిస్తున్నాం. పేదలను అన్నివిధాల పైకి తేవడమే లక్ష్యంగా పీ4కు రూపకల్పన చేశాం. సంకల్పంతో, నిండు మనసుతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిపై ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదు. కళ్లుంటే చూడండి. మనసుతో ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి ఆలోచించండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదు. చేతనైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. అంతేగానీ రాళ్లు వేసే పనిచేసి పేదల ఎదుగుదలకు అడ్డు రావద్దు.’’
సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా...
‘‘అమరావతికి పునర్ వైభవం తెస్తాం. 2027 కల్లా పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేపడతాం. గత ప్రభుత్వం దివాలా తీయించిన విశాఖ ఉక్కును గాడినపెట్టాం. విశాఖకు రైల్వే జోన్ సాధించాం. రోడ్ల మీద గుంతలు పూడ్చాం. డీఎస్సీ ద్వారా జూన్ నెలాఖరులోగా పెద్దఎత్తున టీచర్ పోస్టులను భర్తీచేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుచేశాం. మంచి సంకల్పంతో పీ4 కార్యక్రమం చేస్తున్నాం. సమాజంలో టాప్‌లో ఉన్న పది శాతం మంది, దిగువన ఉన్న 20 శాతం మందిని సామాజిక బాధ్యతగా పైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం. 2029 నాటికి జీరో పావర్టీ రాష్ట్రాన్ని చూడాలన్నదే నా లక్ష్యం’’ అని చంద్రబాబు తెలిపారు.
చిల్లర వేషాలేస్తే సహించను
ప్రజావేదికలో అల్లరిమూకలకు సీఎం వార్నింగ్
సీఎం చంద్రబాబు ప్రజావేదికలో మాట్లాడుతుండగా, దూరం నుంచి ఒకరిద్దరు గొడవకు ప్రయత్నించారు. ఆ అల్లరి మూకపై సీఎం తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ సమస్య ఏమిటో చెప్పండి. నేను వింటాను. కానీ, రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే సహించను. 43 ఏళ్ల రాజకీయ అనుభవం నాది. ఆవలిస్తే పేగులు లెక్కబెడతా’’ అంటూ వారిని హెచ్చరించారు. కాగా, కొత్తగొల్లపాలెం గ్రామంలో పింఛన్లు అందించే కార్యక్రమంలో చంద్రబాబు గతానికి కంటే భిన్నంగా కనిపించారు. రోడ్డు వెంబటి నిలుచుని వినతులు ఇవ్వబోయిన వారిని ‘‘అందరూ ప్రజావేదిక వద్దకు మీటింగ్‌కు రండి. అక్కడ మాట్లాడుకుందాం’ అని తెలిపారు. ప్రజావేదికలో బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథిని గ్రామస్థులకు చంద్రబాబు పరిచయం చేశారు. ‘‘ఈయనది కూడా మీ కులమే (యాదవులు). కష్టపడి పైకొచ్చి ఈ స్థాయిలో ఉన్నారు. మీరంతా ఇలాగే ఎదగాలి’’ అన్నారు.
సంపన్నులు సహకరిస్తే రాష్ట్రమే బంగారు కుటుంబం..
పీ 4 కార్యక్రమంలో సీఎం వ్యాఖ్య..
ఎమ్మెల్యే, కలెక్టరుపై చిరుకోపం
ఆర్థిక పటిష్ఠత ఉన్నవారు పీ4 కార్యక్రమానికి సహకరిస్తే రాష్ట్రమే బంగారు కుటుంబం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో 10 బంగారు కుటుంబాలను (పేద కుటుంబాలు), ఇద్దరు మార్గదర్శకులను (సంపన్నులు) ప్రజావేదికకు ఆయన పరిచయం చేశారు. చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన లీడింగ్ ఫార్మ సూటికల్ కంపెనీ యజమాని విక్రమ్ నారాయణరావు, పర్చూరు మండల పరిధిలోని ఇంకొల్లు గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త వసంత శ్రీనివాసరావులు మార్గదర్శకులుగా ముందుకువచ్చారు. కొత్తగొల్లపాలెంలో 10 కుటుంబాలను ఆదుకునేందుకు వారు సుముఖత చూపారు. కొత్తగొల్లపాలెంకు చెందిన బంగారు కుటుంబ మహిళ అంకమ్మ భర్త చనిపోయాడు. కుమారుడు గణేశ్‌ను పెట్టుకుని జీవిస్తున్నానని ఆమె తెలపగా, గణేశ్‌ను వేదికపైకి సీఎం పిలిపించారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావని అడగ్గా, గణేస్ సాఫ్ట్‌వేర్ అని చెప్పారు. గణేశ్‌ను ‘మార్గదర్శకులు’ ఆ రంగంలో తీర్చిదిద్దుతారని సీఎం అన్నారు. కాగా, పీ4 అర్హత కలిగిన పది కుటుంబాల్లో నలుగురు సభలో కనిపించకపోవడంతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వెంకటమురళిపై సీఎం చిరుకోపం ప్రదర్శించారు. హార్డ్‌గా కాదు, స్మార్ట్‌గా పని చేయాలని సూచించారు.
చక్కగా నవ్వారు.. బాగా పలకరించారు
‘‘సీఎం మా ఇంటికి వస్తున్నారంటే ముందు భయమేసింది. అంత పెద్దవాళ్లతో నేను ఎలా నడుచుకోవాలో అర్థం కాలేదు. అంతలోనే చిరునవ్వుతో దేవుడిలా ఆ పెద్దాయన ఇంట్లోకి వచ్చారు. చాలా బాగా నవ్వారు. చక్కగా పలకరించారు. ‘పింఛన్ వస్తున్నదా అమ్మా? ఎవరైనా ఇబ్బందిపెడుతున్నారా?’ అని అడిగారు. కుటుంబంలో సమస్యలు అడిగారు. మీ ఎమ్మెల్యే ఏలూరి మంచివారు. మీకు అండగా ఉంటారని చెప్పారు. ఈ జన్మకు ఇది చాలు.. చాలా సంతోషంగా ఉంది.’’
- బత్తుల జాలమ్మ, పింఛన్ లబ్ధిదారు
మాకిక భయం లేదు
‘‘ముఖ్యమంత్రి నేరుగా మా ఇంటికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ బాధ్యత తీసుకుంటానని ఆయన ఽభరోసా ఇవ్వడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. నా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. నా పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. ఆమెకు ప్రభుత్వం రూ. 15 వేలు పింఛను ఇస్తోంది. ఇక మాకు భయం లేదు. చాలా ఆనందంగా ఉంది.’’
- వడ్లమూడి సుభాషిణి, లబ్ధిదారు
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News