Share News

అవినీతి ‘సఖి’

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:25 AM

ప్రభుత్వ ఆస్పత్రిలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిమయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళలకు సాయం దగ్గర నుంచి పోస్టుల భర్తీ వరకు ప్రతి పనిలోనూ పీడీగా పనిచేసిన అధికారి వసూళ్లకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. బాధిత మహిళలకు రక్షణగా ఉండాల్సిన వీరు వారి భర్తలకు సాయం చేస్తూ కేసులు వీగిపోయేలా చేశారనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా వదిలేసిందని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై సృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అవినీతి ‘సఖి’

- విజయవాడ ప్రభుత్వాస్పత్రి సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లో అక్రమాలు

- గత వైసీపీ హయాంలో రెచ్చిపోయిన పీడీ!

- పోస్టుల దగ్గర నుంచి సేవల వరకు అన్నీటికి వసూలే..

- బాధిత మహిళల రక్షణ గాలికి.. వారి భర్తలకు ఫిర్యాదు కాపీల చేరవేత

- వారి నుంచి భారీగా ఫోన్‌పేల ద్వారా నగదు వసూలు

- బాధిత మహిళల ఫిర్యాదులతో నాడు విచారణ కమిటీ.. నేటికీ చర్యలు శూన్యం

- కూటమి ప్రభుత్వంపైనే బాధితుల ఆశలు

ప్రభుత్వ ఆస్పత్రిలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిమయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళలకు సాయం దగ్గర నుంచి పోస్టుల భర్తీ వరకు ప్రతి పనిలోనూ పీడీగా పనిచేసిన అధికారి వసూళ్లకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. బాధిత మహిళలకు రక్షణగా ఉండాల్సిన వీరు వారి భర్తలకు సాయం చేస్తూ కేసులు వీగిపోయేలా చేశారనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా వదిలేసిందని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై సృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఆపదలో ఉన్న మహిళలు మహిళా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 181కు ఫోన్‌ చేసినపుడు సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఆ మహిళలకు రక్షణ కల్పించి వారికి వైద్య సహాయం, లీగల్‌ సహాయం వంటివి అందించాలి. పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. బాధితులకు తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ఇలా ఆపదలో ఉన్న మహిళలకు ఎంతో విలువైన సేవలందించాల్సిన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ బాధిత మహిళలకు రక్షణ కల్పించకపోగా వారినే భక్షించేలా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఉన్న అధికారిణి ఒకరు పీడీగా ఇక్కడ చక్రం తిప్పారు. అనేక అవినీతి ఆరోపణలపై చివరకు ఆమె సస్పెండ్‌ కూడా అయ్యారు.

నియామకాల్లో అక్రమాలు

ఆవిడ చేసిన అక్రమాల్లో సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటర్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కేస్‌ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, మల్టీపర్పస్‌ వర్కర్లకు సంబంధించి నియామకాలు కూడా ఒకటి. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటర్‌ నియామకానికి బేరసారాలు జరిగాయని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ పోస్టు భర్తీ తప్ప మిగిలిన పోస్టులను భర్తీ చేశారు. ఈ మిగిలిన పోస్టులను కూడా కొందరికి అర్హతలు లేని, అనుభవం లేని వారికి, ప్రావిజినల్‌ సర్టిఫికెట్లు కూడా చూపలేని వారికి ఇచ్చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారాల కారణంగా.. సఖి వన్‌స్టార్‌ సెంటర్‌ కాస్తా అవినీతి అక్రమాలమయంగా మారిపోయింది.

బాధితులకు నరకమే!

సఖికి సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటర్‌ పోస్టు భర్తీ కాకపోవటంతో ఈ పోస్టును మరొకరికి ఇన్‌చార్జిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ, ఇన్నీ కాకుండా ఉంటున్నాయి. బాధిత మహిలకు సహాయం చేయాల్సింది పోయి.. వారికే నరకం చూపించే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందరో మహిళా బాధితులు ఈ సెంటర్‌కు వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను ఇక్కడ వారు వారి భర్తలకు చేరవేయటం.. తద్వారా వారి నుంచి డబ్బులు తీసుకోవటమనే సంస్కృతి ప్రబలిపోయిందని పలువురు ఆరోపించారు. రాను రానూ మరింత పరాకాష్టకు చేరుకుంది. భార్యలకు తెలియకుండా వారి ఫిర్యాదు కాపీలను భర్తలకు ఇవ్వటం, భర్తలకు తెలియకుండా వారి ఫిర్యాదు కాపీలను భార్యలకు ఇవ్వటం, సరైన లీగల్‌ గైడెన్స్‌ ఇవ్వకపోవటం, ఫిర్యాదు కాపీలు ఒకరివి ఒకరికి మార్చటం ఇలా అత్యంత దారుణంగా ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి. ఇలా చేయటం ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి.

విచారణకు ఆదేశించినా..

ఈ వ్యవహారాలపై పలువురు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా.. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విచారణకు కూడా ఆదేశించారు. విచారణాధికారిని నియమించారు. ఆయన నివేదికను కూడా ఇవ్వటం జరిగింది. విచారణాధికారి ఇచ్చిన నివేదికను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తొక్కిపట్టారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోకపోగా.. ఆరోపణలు వచ్చిన వారికి ఇన్‌చార్జిగా సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటర్‌ పోస్టులోనే కొనసాగించటం గమనార్హం. బాధిత మహిళలకు అండగా ఉండాల్సిన సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లో అందించాల్సిన సేవల పట్ల ఎలాంటి అవగాహన లేనివాళ్లు, సమాజాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరించేవాళ్లు ఉండటం దురదృష్టకరమని పలువురు విమర్శించారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న ఉద్యోగినిపై దాదాపుగా 10 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై ఆధారాలతో సహా నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోవటం లేదని తెలిసింది. ఆ ఉద్యోగిని ఫోన్‌ను తనిఖీ చేస్తే ఎవరెవరితో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడటం జరిగింది? ఎవరెవరి నుంచి తన ఖాతాకు డబ్బులు జమ అయ్యాయన్నది తేలుతుందని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అర్హతల ప్రకారం సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటర్‌ పోస్టును భర్తీ చేయటంతో పాటు మిగిలిన పోస్టుల్లో కొనసాగుతున్న అనర్హులను ఏరివేసి నిబంధనల ప్రకారం అర్హులను నియమించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:25 AM