Share News

Hyderabad: న్యాయవాది దారుణ హత్య

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:11 AM

హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్‌ ప్రాంతంలో ఒక న్యాయవాది ప్రియురాలి చిరునామా చెప్పలేదని, దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. న్యాయవాది ఇజ్రాయెల్, దస్తగిరి మధ్య వివాహేతర సంబంధం కారణంగా గొడవలు మొదలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: న్యాయవాది దారుణ హత్య

  • ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం

  • అందరూ చూస్తుండగానే కత్తితో దాడిచేసిన నిందితుడు

  • హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌లో ఘటన

  • మృతుడు ఇజ్రాయెల్‌.. మహేశ్వరం కాంగ్రెస్‌ నేత

మహేశ్వరం/ సైదాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలి చిరునామా చెప్పడంలేదని ఓ న్యాయవాదిని దారుణంగా చంపాడో దుండగుడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇజ్రాయెల్‌ కుటుంబసభ్యులతో కలిసి ఐఎస్‌ సదన్‌ పరిధిలోని చంపాపేటలో నివాసముంటూ.. తన ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంటులో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని వాచ్‌మెన్‌ భార్యతో అదే ప్రాంతంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా ఇజ్రాయెల్‌ వారికి రాజీ కుదిర్చాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ వాసులు వాచ్‌మెన్‌ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించగా, వారు తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాలని దస్తగిరి పలుమార్లు ఇజ్రాయెల్‌ను కోరాడు. తాను లాయర్‌నని బ్రోకర్‌ను కాదని ఇజ్రాయెల్‌ దస్తగిరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు దస్తగిరిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. వాచ్‌మెన్‌ భార్య తనకు దూరం కావడానికి ఇజ్రాయెలే కారణమని భావించిన దస్తగిరి, ఆయన వల్లే పోలీసులు తనకు కౌన్సిలింగ్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఇజ్రాయెల్‌పై పగ పెంచుకుని చంపాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌ వాకింగ్‌కు వెళ్లి వస్తున్న సమయంలో దస్తగిరి కాపుకాసి ఆయనపై కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఇజ్రాయెల్‌ను అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.


నేడు హైకోర్టులో విధుల బహిష్కరణ

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఎర్రబాపు ఇజ్రాయెల్‌ అనే న్యాయవాదిని ప్రత్యర్థి కక్షిదారు హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సోమవారం పేర్కొంది. ఇందుకు నిరసనగా మంగళవారం హైకోర్టులో విధులు బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అయితే హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.

Updated Date - Mar 25 , 2025 | 05:11 AM