Polavaram Irrigation Scheme: బనకచర్ల.. సీమ గేట్‌వే!
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:43 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం రాయలసీమకు గేట్‌వే లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా ఆర్థిక సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు

పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమే: చంద్రబాబు
9.14 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరు
మరో 3 లక్షల హెక్టార్లకు స్థిరీకరణ
80 లక్షల మందికి తాగునీరు
పారిశ్రామికావసరాలకు 20 టీఎంసీలు
200 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ప్రాథమిక అంచనా రూ.81,900 కోట్లు
జాతీయ నదుల అనుసంధానంలో చేర్చండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం లేఖ
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి రాయలసీమకు గేట్‌వేలాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ నదుల అనుసంధానంలోనూ కీలక భూమిక వహించే ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధ్యయన దశలో ఉందన్నారు. రూ.81,900 కోట్ల వ్యయమవుతుందన్నది ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. ఈ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం).. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించతలపెట్టామని తెలిపారు. 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు, 80 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామికావసరాలకు 20 టీఎంసీలు, 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమన్నారు. ఇందుకోసం రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఈ ప్రాజెక్టుకు తరలిస్తామని వివరించారు. ఇప్పటికే లైడార్, డ్రోన్ సర్వేలు చేపడుతున్నామని తెలిపారు. కరువు సీమ రాయలసీమతో పాటు.. పల్నాడునూ సస్యశ్యామలం చేసే ఈ పథకాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద దీనికి ఆర్థికంగా సాయం అందించి కేంద్రమే పూర్తి చేయాలని కోరారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌కు ఈ మేరకు మూడు పేజీల లేఖ అందజేశారు. ఈ పథకాన్ని మూడు దశల్లో చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. దశలవారీగా వివరాలివీ..
తొలి దశ: ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోత
పోలవరం-బనకచర్ల మొదటి దశ కింద గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తారు. ఇప్పటికే ఈ కుడి కాలువ ద్వారా పట్టిసీమ నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నాం. ఈ కాలువ సామర్థ్యం పెంచి.. రోజుకు 18,000 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీల చొప్పున 100 రోజులు ఎత్తిపోస్తాం. ఇందుకు 290 మెగావాట్ల విద్యుత్ అవసరం. కుడికాలువ విస్తరణకు 9,000 ఎకరాల భూమి సేకరించాలి. అలాగే దీనికి సమాంతరంగా 40 కిలోమీటర్ల మేర కొత్త కాలువ నిర్మించాల్సి ఉంటుంది. ఈ దశకు రూ.13,800 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
2వ దశ: బొల్లాపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోత
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు వెన్నెముక బొల్లాపల్లి రిజర్వాయరు. దీని సామర్థ్యం 173 టీఎంసీలు. రెండో దశలో ప్రకాశం బ్యారేజీ ఫోర్‌షోర్ నుంచి ఆరు దశల్లో ఈ రిజర్వాయరులోకి నీటిని ఎత్తిపోస్తాం. దీనికి మరో ప్రత్యామ్నాయం 1.2 కిలోమీటర్ల పొడవున టన్నెల్‌ను నిర్మించడం. అయితే మొదటి ప్రణాళికతోనే సాంకేతికంగా, ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. దీని అమలుకు కేవలం 15 గ్రామాలకు సహాయ, పునరావాసం కల్పిస్తే సరిపోతుంది. పైగా జాతీయ స్థాయిలో నిర్మించే రిజర్వాయర్లకు ఒక టీఎంసీకి సగటున రూ.100 కోట్ల నుంచి 200 కోట్లు వ్యయమవుతుంటే.. బొల్లాపల్లి రిజర్వాయరుకు టీఎంసీకి సగటున రూ.30 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. పైగా దీని ద్వారా 230 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కూడా జరుగుతుంది. ఈ రిజర్వాయరు నిర్మాణానికి రూ.35,760 కోట్ల వ్యయమవుతుందని అంచనా.
మూడో దశ: 3 ఎత్తిపోతలతో..
మూడో దశలో బొల్లాపల్లి నుంచి రోజుకు రెండు టీఎంసీలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించేందుకు 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంటుంది. ఆ రిజర్వాయరు నుంచి సిద్ధాపురం చెరువుకు నీటిని తీసుకెళ్లి.. అక్కడి నుంచి 11 కిలోమీటర్ల టన్నెల్ మార్గం గుండా బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌లోకి తరలించాలి. సిద్ధాపురం నుంచి నీటిని తోడిన తర్వాత.. కాలువ ద్వారా 200 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలుంది. అలాగే నల్లమల సాగర్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కూడా 0.5 టీఎంసీని తరలించాలి. మూడో దశ పూర్తి చేసేందుకు రూ.32,350 కోట్ల ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా మూడు దశల్లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.81,900 కోట్లు వ్యయమవుతాయి.
For AndhraPradesh News And Telugu News