Share News

జగమంత అసైన్డ్‌ అక్రమాలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:00 AM

అసైన్డ్‌ భూములను కాజేయాలన్న పెద్దల సంకల్పం చాలా పెద్దదే. గత డిసెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 4.21 లక్షల ఎకరాల భూములను చట్టవిరుద్దంగా, రూల్స్‌కు వ్యతిరేకంగా నిషేధ జాబితా 22(ఏ)నుంచి తొలగించారని ప్రభుత్వం భావించింది.

జగమంత అసైన్డ్‌ అక్రమాలు

  • పెద్దల కోసం యథేచ్ఛగా ఫ్రీహోల్డ్‌

  • కేబినెట్‌ సబ్‌కమిటీకి రెవెన్యూ నివేదిక

  • దిద్దుబాటుకు ఎనిమిది ప్రత్యామ్నాయాలు

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి) : అసైన్డ్‌ భూములను కాజేయాలన్న పెద్దల సంకల్పం చాలా పెద్దదే. గత డిసెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 4.21 లక్షల ఎకరాల భూములను చట్టవిరుద్దంగా, రూల్స్‌కు వ్యతిరేకంగా నిషేధ జాబితా 22(ఏ)నుంచి తొలగించారని ప్రభుత్వం భావించింది. వాటిపై ఏం చర్యలు తీసుకోవాలా అని మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పుడు రెవెన్యూశాఖ మరో సంచలన నివేదిక ఇచ్చింది. ఫ్రీ హోల్డ్‌ అక్రమాలు అక్షరాలా 5,74,306 ఎకరాలని తేల్చింది. అంటే, డిసెంబరు నాటి నివేదికలతో పోలిస్తే, అక్రమాల జాబితాలో అదనంగా మరో 1,52,873 ఎకరాలు చేరాయు. ఫలితంగా జగన్‌ జమానాలో ఫ్రీ హోల్డ్‌ ప్రక్రియ పేరిట సాగిన భారీ దందాను రెవెన్యూశాఖ వెలుగులోకి తెచ్చింది. బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పాల్గొన్నారు. అసైన్డ్‌ భూములపై రెవెన్యూశాఖ తాజా నివేదికను సమర్పించింది. అందులోని పలు కీలక అంశాలను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రజంటేషన్‌ ద్వారా వివరించినట్లు తెలిసింది.


జరిగింది ఇదీ..

గత జగన్‌ ప్రభుత్వం అసైన్డ్‌మెంట్‌ చట్టం-1977 ను సవరించి 20ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్‌ భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించి రైతులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు (ఫ్రీ హోల్డ్‌) కల్పిస్తామని ప్రకటించింది. దాని అమలుకు 2023 డిసెంబరు 19న జీవో 596 జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే 2024 జూన్‌ వరకు 13,59,805 ఎకరాల భూమిని నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్‌ చేశారు. రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. వీటిల్లోని అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో విచారణ చేయించింది. గత డిసెంబరులో రెవెన్యూశాఖ సర్కారుకు ఇచ్చిన నివేదిక ప్రకారం, 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారు. ఇందులో 4.21లక్షల ఎకరాలను చట్టవిరుద్దంగా, జీవో 596ను ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి తొలగించినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం మరోసారి పున:పరిశీలన చేయించింది. ఈ నెల 4నాటికి రెవెన్యూశాఖ రికార్డుల పున:పరిశీలన పూర్తిచేసింది. ఇదే అంశం బుధవారం మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చింది. కాగా, రెవెన్యూ రికార్డుల పున:పరిశీలనలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల్లో 2,69,178 ఎకరాల భూమికి అసైన్‌ చేసినట్లుగా నిర్ధారించే రికార్డులే లేవని తేలింది. 20 ఏళ్ల కాలపరిమితి నిండని 26,975 ఎకరాలను కూడా ఫ్రీ హోల్డ్‌ చేయించిన ఘనత జగన్‌ సర్కారుదే. ఈ నేపఽథ్యంలో అక్రమాల గుట్టు పూర్తిగా తే లేవరకు ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతను ఈ ఏడాది మే 11 వరకు పొడిగించినట్లు రెవెన్యూశాఖ నివేదించింది. భూ అక్రమాలపై విచారణ పూర్తికాలేదని, అనేక లావాదేవీలు, భూముల రికార్డులను పున:పరిశీలన చేస్తున్నామని సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.


ఫ్రీ హోల్డ్‌ను ఏం చేస్తారు?

ఫ్రీ హోల్డ్‌ను ఏం చేయాలన్న అంశంలో ఉపసంఘం ఎదుట రెవెన్యూశాఖ ఎనిమిది రకాల ప్రత్యామ్నాయాలను ఉంచినట్లు తెలిసింది. అవి...

1) చట్టసవరణను కొనసాగిస్తారా? లేక పాత విధానమే పునరుద్ధరిస్తారా? జీవో 596ని అమలు చేస్తారా? 2) నిషేధ జాబితాను తిరిగి పునరుద్ధ్దరిస్తారా? 3) ఫ్రీ హోల్డ్‌ను రద్దుచేస్తారా? 4) లేక అక్రమాలకు గురైన భూములకు మాత్రమే ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్‌ను రద్దుచేస్తారా? 5) అక్రమంగా ఫ్రీ హోల్డ్‌ అయి, రిజిస్ట్రేషన్‌ చేసిన భూముల సేల్‌డీడ్‌లను రద్దుచేస్తారా? 6) చట్టవిరుద్ధంగా నిషేధ జాబితా నుంచి బయటపడేసిన భూములను అసైన్డ్‌ చట్టంలోని క్లాజులను ఉపయోగించి తిరిగి స్వాధీనం చేసుకోవాలా? 7) భూ అక్రమాల్లో పాత్ర ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 8) ఫ్రీహోల్డ్‌ విధానంలో మార్పు చేర్పులు చేసి కొనసాగిస్తారా? కాగా, ఏప్రిల్‌ 16న మరోసారి ఉపసంఘం భేటీ అయి రెవెన్యూశాఖ సూచించిన ప్రత్యామ్నాయాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఫ్రీ హోల్డ్‌ భూములపై సమగ్రంగా చర్చించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. అక్రమంగా ఫ్రీ హోల్డ్‌ అయిన భూములపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నియోజకవర్గాల వారీగా అసైన్డ్‌మెంట్‌ కమిటీలు పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో కమిటీల నియామకం ఉంటుందన్నారు. జగనన్న ఇళ్ల పథకంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తామని తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 04:00 AM