AP Assembly: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు
ABN, Publish Date - Mar 05 , 2025 | 12:38 PM
AP Ministers: శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు.

అమరావతి: ఏపీ శాసన మండలిలో రగడ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (YSRCP MLC Botsa Satyanarayana) అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. బొత్స ఏం మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పలు అంశాలను మంత్రులు శాసన మండలిలో ప్రస్తావించారు. శాసన మండలిలో రైతు సమస్యలపై చర్చ జరిగింది. ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయంపై చిత్త శుద్ది లేదని సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధివిధానాలు ఖరారు చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తాము రైతులను మోసం చేయమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నష్టపరిచిందని అన్నారు. వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరిక్షలు లేవు, పంటల భీమా చెల్లింపులు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
ALSO READ: Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
‘‘ఆడుదాం ఆంధ్రా’’లో అవకతవకలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
‘‘ఆడుదాం ఆంధ్రా’’లో జరిగిన అవకతవకల పట్ల పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శాసన మండలిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని అన్నారు. ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట తప్పుచేసిన అధికారులు ప్రజా ప్రతినిధుల పాత్రల గురించిన రిపోర్ట్ సభకు అందజేస్తామని అన్నారు. ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కోసం గత వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.119 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆర్ అండ్ బీ, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్, జిల్లా కలెక్టర్స్ ద్వారా ఖర్చు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి నిమ్మల రామానాయుడు
వచ్చే సీజన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి తక్షణం చేయాల్సిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంబంధించి జీవనాడి అయినా హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. అందువల్లనే రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ.3243 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ ముద్దుబిడ్డననే చెప్పుకునే జగనే ముమ్మాటికి కారణమని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకు సంబంధించి 80 శాతం పనులు పూర్తయితే జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. ఈ రకంగా రాయలసీమ ప్రజల పాలిట జగన్ ద్రోహిగా మిగిలిపోయారని చెప్పారు. 2014 -19 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు రూ.4000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు. హంద్రీనీవాలో 3850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మోటార్లను సైతం పూర్తిస్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ట్రాఫిక్ నివారణకు విశాఖ మెట్రో ప్రతిపాదన: మంత్రి నారాయణ
భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు గాజువాక నుంచి ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు మెట్రోతో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలున్నాయని గుర్తుచేశారు. ట్రాఫిక్ నివారణకు విశాఖ మెట్రో ప్రతిపాదన ఉందని చెప్పారు. గాజువాక నుంచి భోగాపురం వరకూ మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం జరుగుతుందని అన్నారు. మెట్రో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆమోదం పొందేలా చూస్తామని... ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ కొంతమేర తగ్గుతుందని.. కానీ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిపారు. ఏహెచ్ 45 రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడానికి 15 అంతర్గత రోడ్లు ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించానని అన్నారు. పాత హైవే ఏహెచ్ 47 నుంచి ఎన్ హెచ్ 16కు ఆరు రోడ్లు ప్రతిపాదన ఉందని గుర్తుచేశారు. విశాఖపట్నంలోని ఎమ్మెల్యేలు, అధికారులతో మీటింగ్ పెట్టాలని మంత్రిని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. వచ్చే వారమే మీటింగ్ పెడతానని మంత్రి నారాయణ సభలో చెప్పారు.
మెడికల్ కాలేజీలను అలా నిర్మిస్తాం: మంత్రి సత్య కుమార్
ఏపీలో మెడికల్ కాలేజీలపై శాసనమండలిలో చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారా అంటూ వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నామని మంత్రి సత్య కుమార్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాలేజీల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం 15 శాతం పనులు మాత్రమే గత ఐదేళ్లలో పూర్తి చేశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణాల గురింటి పట్టించుకోని నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒక్క పులివెందుల కాలేజికి మాత్రం 59 శాతం నిధులు ఖర్చు చేశారన్నారు. టెండర్‌లే పిలవని పార్వతిపురం కాలేజీని అద్భుతంగా కట్టామని అప్పటి డిప్యూటీ సీఎం చెప్పడం హస్యస్పదంగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ విద్యను పేద వాడికి దూరం చేసిందని మంత్రి సత్య కుమార్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 05 , 2025 | 03:19 PM