Purandeswari: మోదీ పాలనకు ఇదే నిదర్శనం.. వక్ఫ్ బిల్లుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:43 PM

Purandeswari: ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్చను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడటమే తప్ప.. వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు.

Purandeswari: మోదీ పాలనకు ఇదే నిదర్శనం.. వక్ఫ్  బిల్లుపై  పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
Daggubati Purandeswari

విజయవాడ: భారతదేశంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ తీసుకు వచ్చారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ముప్పై ఏళ్లుగా ఆయన మంత్రిగా పని చేస్తూ ప్రజలకు సేవలు అందించారని అన్నారు. ఇప్పుడు ఉన్న పీడీఎస్ వ్యవస్థను జగజ్జీవన్ రామ్ ప్రారంభించారని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మధుకర్, షేక్ బాజీ, ఇతర నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచి ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. పాఠశాల స్థాయిలోనే వివక్షను ఎదుర్కొని అవమానాలకు గురయ్యారని చెప్పారు. కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదని బాల్యంలోనే చైతన్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు. కళాశాల స్థాయిలో కూడా ఏదోక పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. 40 ఏళ్ల పాటు పార్లమెంటేరీయన్‌గా ఉండటం చాలా గొప్ప విషయమని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.


బాబూ జగజ్జీవన్ రామ్ జనతాలో చేరారు..

1977లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతాలో చేరారని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలను అందరూ స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎస్సీ కులాల అభ్యున్నతి కోసం చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మహిళల పేరుతో ఇళ్లు కేటాయిస్తున్నారని చెప్పారు. చదువుల్లో ముందుకు వెళ్లేలా ఎస్సీ, ఎస్టీ కులాల వారికి స్కాలర్ షిప్‌లు అందిస్తున్నారని అన్నారు. స్టార్ట్ అప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమాలను ప్రధానమంత్రి నరంద్ర మోదీ తీసుకు వచ్చారని తెలిపారు. యువతను పారిశ్రామిక వేత్తలకు తీర్చిదిద్ది, పది మందికి ఉపాధి కల్పించేలా చేశారని అన్నారు. డి.ఐ.సి.సి.ఐ (డిక్కీ) అనే పారిశ్రామిక సంస్థను దళితుల అభ్యున్నతి కోసం అమల్లోకి తీసుకు వచ్చారని చెప్పారు. బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను ఆదర్శంగా తీసుకుని మోదీ అనేక పథకాలను అమల్లోకి తెచ్చారని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.


అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం..

అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నానని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మన సైనికులను హతమారుస్తున్న సమయంలో పొరుగు దేశంలోకి వెళ్లి ఉగ్రవాద సంస్థలను హతమార్చారని అన్నారు. జమ్ము కాశ్మీర్ భారతదేశంలో అంతర్ భాగం అని చెప్పారని గుర్తుచేశారు. శరణార్దులుగా వచ్చిన వారికి సిటిజన్ షిప్ ఇచ్చి ఆశ్రయం కల్పించారని ఉద్ఘాటించారు. 500 సంవత్సరాల బారతీయుల కల రామమందిరం నిర్మాణాన్ని నిజం చేశారని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడటమే తప్ప.. వారి క్షేమం కోసం చేసిన ఘనత మోదీదేదని.. అయితే రాష్ట్రపతి ఈ బిల్లును త్వరలో ఆమోదిస్తారని భావిస్తున్నామని అన్నారు. చట్ట రూపంలో అమల్లోకి వచ్చాక.. ఫలితాలను అందరూ చూస్తారని తెలిపారు. సరైన చర్చ జరగకుండా ఈ చట్టం చేశారని సోనియా తమపై అపవాదు వేశారని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చారు.


సమర్ధవతంగా వక్ఫ్ బోర్డు..

ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతల్లో ఇంకా సమర్ధవతంగా చేయడానికి మార్పులు చేశారని అన్నారు. మతపరమైన అంశాల్లో ఎక్కడా మార్పులు చేయలేదు.. తల దూర్చలేదని తేల్చిచెప్పారు. భక్తుల కోసం ఇచ్చిన భూములను సరిగా వినియోగిస్తున్నారా లేదా అనేది సరి చేయడానికి మార్పులు చేశారన్నారు. 2013 సంవత్సరంలో ఎన్నికలకు కొన్ని నెలలు ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్‌ను సవరణ చేశారని అన్నారు. మైనార్టీ బోర్డును డైల్యూట్ చేసి.. కావాల్సిన వారు బోర్డులు పెట్టుకోవచ్చని మైనార్టీల్లో విభజన తెచ్చారన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని విమర్శించారు. వక్ఫ్ భూమిగా పరిగణిస్తే.. ఇక దానిని ఎవరూ ప్రశ్నించడానికి లేదు.. వక్ఫ్ ఆస్తిగా తీసుకోవడమేనని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా తొమ్మిదన్నర లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కింద ఉందని దగ్గుబాటి పురందేశ్వరి గుర్తుచేశారు.


సభలో వారు ఉన్నారా..

ఈ చర్చ జరిగినప్పుడు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ సభలో ఉన్నారా అని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు అభిప్రాయాలు చెప్పాక పార్లమెంట్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. రాజ్యసభలో మరునాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. మరి వారు సభలో లేకుండా వీటిపై అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేశారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపాలని అందరూ చెప్పారన్నారు. నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారి అభిప్రాయలను సేకరించారని తెలిపారు. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డుల నుంచి జాయింట్ పార్లమెంట్ కమిటీకి తమ అభిప్రాయాలను వివరించారని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు అందరి ఆమోదంతోనే జరిగిందని.. అయినా కొంతమంది రాజకీయం చేస్తున్నారని దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు.


ముస్లింల్లో వెనుకబాటు తనం..

ఇండియన్ రైల్వే, డిఫెన్స్ తర్వాత వక్ఫ్ దగ్గరే భూమి ఎక్కువగా ఉందని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. వక్ఫ్ ఆదాయం మాత్రం రూ. 163 కోట్లు అంటే నవ్వుతారని చెప్పారు. ముస్లింల్లో వెనుకబాటు తనం నిర్ధారించేందుకు రాజేంద్రసచార్ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. వక్ఫ్‌కు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకోకలిగితే.. ర.16వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆ కమిటీ చెప్పిందన్నారు. నిజంగా వక్ఫ్ భూములను సద్వినియోగం చేస్తే.. మైనార్టీల్లో పేదరికం అనేది ఉండదని చెప్పారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో.. ఈ భూములను ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చి.. కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారని తెలిపారు. నిబద్దతతో పని చేయడం లేదని స్పష్టత వచ్చాకే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చారని అన్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు అసలు ప్రాతినిథ్యం లేదని చెప్పారు. ముస్లిం మైనార్టీలో వెనుకబడిన వారికి వక్ప్ బోర్డులో ప్రాతినిధ్యం లేదని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.


ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు...

వీరందరికీ ఇప్పుడు సవరణ బిల్లు ద్వారా ప్రాతినిధ్యం కల్పించాం.. తప్పు ఎలా అవుతుందని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం ముస్లింల జీవితాలతో ఆడుకున్న పార్టీలకు మీరే బుద్ది చెప్పాలని హెచ్చరించారు. బీజేపీ ముస్లింలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు.. మీ సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ అని తెలిపారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసినా.. మీకోసం పథకాలు అమలు చేసింది బీజేపీనే అని గుర్తుచేశారు. వైసీపీ లోక్‌సభలో సవరణ బిల్లుకు సపోర్టు చేయమని చెప్పి.. రాజ్యసభలో విప్ ఇచ్చి మరీ మద్దతు ఇచ్చారని చెప్పారు. వైసీపీది పూర్తిగా ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. బీజేపీ మాత్రం ముస్లింల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఏప్రిల్ 6 వ తేదీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవమని తెలిపారు. రేపు అన్ని ప్రాంతాలలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ సేవకు, దేశ సేవకు అంకితం అయ్యే రోజుగా పరిగణించాలని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

For More AP News and Telugu News

Updated Date - Apr 05 , 2025 | 12:50 PM