Minister Savita: ఆ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊపిరిపోసింది
ABN, Publish Date - Feb 01 , 2025 | 09:36 PM
Minister Savitha: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.

అమరావతి : కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సవిత ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయింపుపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌లకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు, పోలవరానికి ఈ బడ్జెట్ ఊపిరిపోసిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసేలా వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఈ బడ్జెట్ ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.
ప్రజల అకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్: మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రజల అకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరి నిచ్చేలా నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, నేచురల్ ఫార్మింగ్‌కు, విశాఖ పోర్ట్‌కు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం సంతోషకరమని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. గత ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని రంగాల్లో నిర్వీర్యం అయిపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి మంత్రి అనగాని సత్యప్రసాద్ కృతఙ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగా నిధులు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఏపీ కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.71 లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి రూ.2.68 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.98 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీకి అప్పు పరపతిని(ఎఫ్.ఆర్.బీ.ఎం) జీరోకు చేర్చారని అన్నారు. గత ఐదేళ్లలో ఆర్థికంగా చితికిపోయిన ఏపీని అన్నివిధాలా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండటం ఆనందదాయకమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తమ ప్రసంగంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం సంతరించుకునేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్
Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
CM Chandrababu: ఏపీ రైతులకు శుభవార్త.. అప్పటి నుంచే రైతు భరోసా
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 01 , 2025 | 10:42 PM