బీటీ నాయుడు అను నేను..
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:42 PM
శాసనమండలి సభ్యుడిగా బీటీ నాయుడు బుధవారం ప్రమాణాస్వీకారం చేశారు. శుభముహుర్తం మధ్యాహ్నం 1:15 గంటలకు ఆయన శాసనమండలిలోని చైర్మన కార్యాలయంలో మండలి చైర్మన మోషెనురాజు బీటీ నాయుడు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన బీటీ
హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, తిక్కారెడ్డి
కర్నూలు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడిగా బీటీ నాయుడు బుధవారం ప్రమాణాస్వీకారం చేశారు. శుభముహుర్తం మధ్యాహ్నం 1:15 గంటలకు ఆయన శాసనమండలిలోని చైర్మన కార్యాలయంలో మండలి చైర్మన మోషెనురాజు బీటీ నాయుడు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, ఏపీ కురవ/కురబ వెల్ఫేర్ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, మంత్రాలయం టీడీపీ ఇనచార్జి ఎన.రాఘవేంద్రరెడ్డితో పాటు ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు, అభిమానులు విజయవాడకు తరలివెళ్లారు. శాసనమండలి సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, సెక్రెటరీ రాజ్‌కుమార్‌లు ఎమ్మెల్సీల ప్రమాణాస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీగా బీటీ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి ముందుగా బీటీనాయుడు, సతీమణి పద్మ, కుమార్తె రవళికతో కలసి కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశలను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలి ఆవరణలో టీడీపీ సీనియర్ నాయకులు కె.ఉమాపతినాయుడు, హాల్వి ఉలిగయ్య, కోసిగి ముత్తురెడ్డి, రామిరెడ్డి తదితరులు బీటీ నాయుడుకు అభినందనలు తెలిపారు.
ఫ విశ్వసనీయతకు మరో అవకాశం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా 2019 మార్చిలో బీటీ నాయుడుకు టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారిగా అవకాశం ఇచ్చారు. రాయలసీమ జిల్లాల్లో బలమైన వాల్మీకి సామాజికవర్గానికి చెందిన బీటీ నాయుడు 1994లో నాటి ఆదోని ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న బీటీ నాయుడు లా వృత్తికి పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల పరిశీలకుడిగా పని చేయడమే కాక.. 2009, 2014లో రెండు పర్యాయాలు కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత వల్లే 2019 మార్చిలో తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
కార్యకర్తలను అక్కున చేర్చుకునే పార్టీ
- బీటీ నాయుడు, ఎమ్మెల్సీ:
మా అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, మంత్రి నారా లోకేశలు పని చేసే కార్యకర్తలను అక్కున చేర్చుకుంటారు. రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తారు. అందుకు నేనే ఓ ఉదాహరణ. అత్యంత వెనుకబడిన కోసిగి మండలంలో ఓ మారుమూల గ్రామానికి చెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన నాకు రెండో పర్యాయం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. టీడీపీ అంటేనే బడుగు బలహీనవర్గాల పార్టీ. పల్లె నుంచి ఢిల్లీ వరకు కష్టపడి పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీల గొంతుక అవుతాను. రాయలసీమ సమస్యలపై గళం వినిపిస్తా. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.