కీసరలో... హైడ్రామా
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:37 AM
కంచికచర్ల మండల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త, వైసీపీ నాయకుడు వేల్పుల రమేష్‌ను అరెస్టు చేసేందుకు కంచికచర్ల పోలీసులు శనివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన ఇంట్లోనే ఉండి భార్యతో ఇంట్లో లేడని చెప్పించాడు. పోలీసులను ఇంట్లోకి వెళ్లనీయకుండా జడ్పీటీసీ సభ్యురాలు నిలువరించారు.

వైసీపీ నాయకుడి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు
గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న జడ్పీటీసీ భర్త వేల్పుల రమేష్
నోటీసులు ఇవ్వాలని డిమాండ్
ఇంటి ముందు బైఠాయించిన భార్య
అర్ధరాత్రి 2 గంటల వరకు బయటకురాని రమేష్
కంచికచర్ల రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కంచికచర్ల మండల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త, వైసీపీ నాయకుడు వేల్పుల రమేష్‌ను అరెస్టు చేసేందుకు కంచికచర్ల పోలీసులు శనివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన ఇంట్లోనే ఉండి భార్యతో ఇంట్లో లేడని చెప్పించాడు. పోలీసులను ఇంట్లోకి వెళ్లనీయకుండా జడ్పీటీసీ సభ్యురాలు నిలువరించారు. పోలీసులు ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో చెప్పి, నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గదిలోనే రమేష్ ఉండిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన జోజి అనే వ్యక్తి తన కుమార్తెను కీసర గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆమె భర్త చనిపోయాడు. పెద్దకర్మకు వచ్చిన జోజి ఆస్తిని తన కుమార్తె పేరున రాయాలని వియ్యంకుడితో వివాదానికి దిగాడు. తనకు ఇంకా పిల్లలు ఉన్నారని, ఇప్పుడే ఆస్తిని రాయలేనని ఆయన చెప్పాడు. దీంతో జోజి నేరుగా రమేష్ వద్దకు వెళ్లాడు. అతడు జోజి వియ్యంకుడిని నిర్బంధించి బలవంతంగా ఆస్తిని అతడి కుమార్తె పేరున రాయించాడు. దీనిపై బాధితులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రమేష్ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నానా హంగామా చేశాడు. అతని భార్య, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి తన ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఎవరు ఎంత నచ్చజెప్పినా అర్ధరాత్రి వరకు రమేష్ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం నుంచి పోలీసులు అక్కడే ఉన్నారు. ఏ క్షణాన అయినా రమేష్‌ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది.