భరోసా ఇచ్చేనా?
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:35 AM
సముద్రంలో చేపలు గుడ్లుపెట్టే సమయం కావడంతో రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించడంతో మత్స్యకారులు మళ్లీ ఆవేదనలో మునిగిపోయారు. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ నిషేధం ఉండగా, ఈ సమయంలో తమ పరిస్థితి ఏమిటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా సమయానికి మత్స్యకార భరోసా కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

రేపటి నుంచి రెండు నెలలు సముద్రంలో చేపల వేట నిషేధం
మత్స్యకార భరోసాపైనే మత్స్యకారుల ఆశలు
గత ఏడాది అందరికీ అందని వైనం
ఈసారైనా త్వరగా అందించాలని వినతి
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 111 కిలోమీటర్లమేర సముద్రతీరం ఉంది. కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్ప, చినగొల్లపాలెం, ఏటిపొగరు ప్రాంతాల నుంచి మోటరైజ్డ్ బోట్లు 235, సంప్రదాయ పడవలు 19 సముద్రంలో వేటకు వెళ్తాయి. నాగాయలంక, కోడూరు మండలాల్లోని నాగాయలంక, ఏటిమొగ, ఏసుపురం, జింకలపాలెం, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, గుల్లలమోద, సొర్లగొంది, పాతఉపకాలి, పాలకాయతిప్ప గ్రామాల నుంచి 1,122 మోటరైజ్డ్ బోట్లు, 51 సంప్రదాయ పడవలు చేపల వేట సాగిస్తాయి. మచిలీపట్నం మండలం కానూరు, మంగినపూడి, పల్లెతుమ్మలపాలెం, కేపీటీ పాలెం, పోలాటితిప్ప, క్యాంప్‌బెల్‌పేట, గిలకలదిండి హార్బర్ నుంచి 112 మెకనైజ్డ్ బోట్లు, 739 మోటరైజ్డ్ బోట్లు, నాలుగు సంప్రదాయ పడవలు చేపల వేటకు వెళ్తాయి. మొత్తంగా 2,282 బోట్లలో 12,809 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తారు. మెకనైజ్డ్ బోటు చేపల వేటకు వెళ్లాలంటే కనీసం 2 వేల లీటర్ల డీజిల్‌ను నింపుకోవాలి. వారం పాటు సముద్రంలోనే ఉండి.. వేట కొనసాగిస్తారు. ఈ సమయంలో మత్స్యకారుల జీతాలు, డీజిల్ ఖర్చులు అధికంగానే ఉంటాయి. వాతావరణ అనుకూలించక, ఇతరత్రా కారణాలతో సముద్ర మత్స్యసంపద లభించకుంటే ఒక్కో విడతకు ఒక్కో బోటుకు కనీసం రూ.లక్ష నష్టం వాటిల్లుతుంది. రోజూ తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లి, మధ్యాహ్నం నుంచి తిరిగివచ్చే మోటరైజ్డ్ బోట్లకు సైతం ఖర్చు అధికంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు లభ్యమైతే లాభదాయకంగానే ఉంటుందని, మత్స్య సంపద లభించకుంటే కనీస ఖర్చులు కూడా రావని మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో ఏటా 10,06,189 టన్నుల మత్స్యసంపద ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో సముద్రం నుంచి తరలే మత్స్యసంపదే అధికం. వేట కొనసాగించే బోట్లకు లీటరుకు రూ.9 డీజిల్ సబ్సిడీ ఇస్తున్నా మిగులుబాటు ఉండటం లేదని బోటు యజమానులు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకార భరోసా అందరికీ అందేనా..?
వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలను మత్స్యకార భరోసాగా ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో 12,809 మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవిస్తుండగా, వారిలో 12,151 మందికి గత ఏడాది భరోసా లభించింది. సామాజిక పింఛన్ వస్తోందని, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌కార్డులు సక్రమంగా లేవని, ఇతరత్రా కారణాలు చూపి కొంతమందికి ఈ భరోసాను అందించలేదు. 18 మీటర్ల పొడవున్న మెకనైజ్డ్ బోటులో పనిచేసే మత్స్యకారులు 10 మందికి, మోటరైౖజ్డ్ బోటు మత్స్యకారులు 8 మందికి, సంప్రదాయ పడవలకు సంబంధించి ముగ్గురికి భరోసా ఇచ్చే అవకాశం ఉన్నా అలా చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటికి మత్స్యకార భరోసా అందిస్తారో తెలియకుండా ఉందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.