Share News

Minister Lokesh: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:11 PM

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

Minister Lokesh: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేశ్..
Minister Nara Lokesh

కృష్ణా జిల్లా: కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారని లోకేశ్ మండిపడ్డారు. ఇష్టమెుచ్చినట్లు వ్యవహరించి ప్రజలు, ప్రతిపక్ష నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు. విశాఖ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 2019 -2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతలు, ప్రజా నాయకులు వెళితే వారిని ఇబ్బందులకు గురి చేసి వేధించారని ఆగ్రహించారు.


అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడిని సైతం బయటకు రానివ్వకుండా ఇంటి గేట్లను తాళ్లతో కట్టారని ఆరోపించారు. ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ సర్కార్‌లో మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని ఆగ్రహించారు. ఓ ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి కేసు విత్ డ్రా చేయించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వంశీ అని లోకేశ్ మండిపడ్డారు. కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీని జైలుకు పంపిందని చెప్పుకొచ్చారు. అన్ని విషయాలూ త్వరలో బయటకు వస్తాయని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు, అధికారులు ఇబ్బంది పెట్టారని, వాళ్లపైనా న్యాయపరమైన చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని యువగళం సందర్భంగా 90 బహిరంగ సభల్లో రెడ్ బుక్ గురించి చెప్పినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.


కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వల్లభనేని వంశీ, ఎలినేని రామకృష్ణ, లక్ష్మీపతి, వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్టు కాగా.. వీరంతా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జిల్లా జైలులో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

AP Politics: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా 10 మంది కార్పొరేటర్లు జంప్..

Updated Date - Feb 15 , 2025 | 05:11 PM