Share News

ముంచిన పంటలు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:58 PM

దేవనకొండకు చెందిన ఈ రైతు పేరు బుదారపు అంజి. రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ సాగుచేశాడు. కౌలుకు రూ.50 వేలు, వేరుశనగ సాగుకు రూ.80 వేల పెట్టుబడి పెట్టాడు. అయితే తెగులు ప్రభావంతో దిగుబడి రాలేదు. రూ.40 వేలు కుడా వచ్చే అవకాశం లేదు. దాదాపు రూ.70 వేల వరకు అప్పుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ముంచిన పంటలు
వేరుశనగ, మిరప పంటను చూపుతున్న రైతులు

వేరుశనగకు తెగులు, మిరపకు నల్లి

పెట్టుబడి కూడా రాదని రైతుల ఆవేదన

దేవనకొండ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ ఏడాది రబీలో సాగు చేసిన పంటలు నిలువునా ముంచాయి. వేరుశనగ 4 వేల ఎకరాల్లో సాగుచేయగా, మిరప 3 వేల ఎకరాలలో సాగైంది. సీజన్‌ ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలించక పంటలు పాడయ్యాయి.

వేరుశనగకు ఎర్రనల్లి..

పంటకు ఎర్ర తెగులు సోకడంతో పంట ఎదగలేదు. దీంతో కాయ పట్టే దశలో మొక్క గుల్లబారుతోంది. తెగులు ప్రభావంతో పంట దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు.

పెట్టుబడి కూడా రాలేదు..

ఎకరాకు వేరశనగ సాగుకు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. అయితే రూ.20వేలు మాత్రమే రావడంతో పెట్టుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిరపను ముంచిన నల్లి, ఆకుముడత

వాతావరణ ప్రభావంతో మిరపకు ఎర్రనల్లి, ఆకుముడత సోకింది. దీంతో దిగుబడి ఆశించిన మేర రాలేదు. సాధారణంగాఎకరాకు 40 క్వింటాళ్లు రావలసి ఉండగా, 20 క్వింటాళ్లలోపే రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిరప ధర పతనం

6.5 ఎకరాల్లో మిరప సాగుచేశా. అయితే ఎర్ర నల్లి ప్రభావంతో పంట దెబ్బతింది. దిగుబడి ఆశించినంతగా రాలేదు. వచ్చిన పంటకు ధర కూడా లేదు. - హర్షవర్ధన్‌ రెడ్డి, పాలకుర్తి, దేవనకొండ మండలం

Updated Date - Mar 18 , 2025 | 11:58 PM