TGS RTC : ప్రయాణికులకు నరకం చూపిస్తున్న తెలంగాణ ఆర్టీసీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 08:00 PM
TGS RTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ నరకం చూపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. కానీ ఆర్టీసీ అధికారులు మాాత్రం ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్..ఇంకా చెప్పాలంటే భాగ్యనగరం.. నేటి యువతకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మాత్రం విశ్వ నగరం. అలాంటి విశ్వనగరంలో సికింద్రాబాద్, చార్మినార్, మూసి నది తదితర ప్రాంతాల గురించి అందరికి తెలిసిందే. ఇక సికింద్రాబాద్ అంటే.. రైల్వే స్టేషన్. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ఈ స్టేషన్‌లో దిగుతారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వారిలో అత్యధికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు.అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల వారు సైతం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సికింద్రాబాద్‌కు వస్తారు. అలా వచ్చిన వారు కూర్చోవడానికి సికింద్రాబాద్‌లో బస్ షెల్టర్ సైతం లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో గొప్ప ఆర్బాటంగా ప్రారంభించిన ఏసీ బస్ షెల్టర్లుకు తాళాలు వేసి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు అక్కడి గట్లు మీద కూర్చొని.. గమ్యస్థానం చేరుకునేందుకు వచ్చే బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నగరంలోని వివిధ ప్రాంతాల్లో సైతం ప్రయాణికులు నిలబడేందుకు కనీసం బస్ స్టాప్‌లు కూడా ఉండవు. ప్రజలే కేంద్రంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని చట్ట సభల సాక్షిగా పాలకులు డంకాభజాయించి మరి మాటలు చెబుతున్నా.. అవన్నీ నేతి బిరకాయలో నేయ్యి చందమని ఈ చిత్రాలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
అదీకాక.. ఒకే నెంబర్ బస్సులు వస్తే.. ఒక దాని వెంట ఒకటి వరుసగా వచ్చేస్తాయి. లేకుంటే ఒక్క బస్సు కూడా రాదు. ఇక రాత్రి 9.00 గంటల తర్వాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బస్సులు కూడా నడవవు.ఆ సమయంలో బస్సు స్టాప్ వద్ద పలాన నెంబర్ బస్సు వచ్చిందా? వెళ్లిందా? అంటే చెప్పే నాథుడే లేడంటే అతిశయోక్తి కాదు. నగరంలో పలువురు రాత్రి 10.00 గంటల వరకు ఉద్యోగాలు చేసి.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సు పట్టుకొని ఇంటికి బయలుదేరి వెళ్లే వారి సంఖ్య వందల్లో ఉంటుంది.
అలాంటి వారి గురించి ఈ ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన సైతం చేయదు. అంతేకాదు.. రాత్రి 10.00 గంటల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు దిగి బయటకు వచ్చిన ప్రయాణికుడి..తన ఇంటికి వెళ్లాలంటే పడుతూన్న యాతన అంతా ఇంతా కాదన్నది సుస్పష్టం. కానీ పాలకులకు కానీ.. ప్రజలు చెల్లించే పన్నులు జీతాలుగా తీసుకుంటున్న ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఇవేమీ పట్టవన్న సంగతి సుస్పష్టం.
ఇది టీజీఎస్ఆర్టీసీ స్పెషాలిటి..
శివరాత్రి పండగ వేళ.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వాటిలో మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తుంది. కానీ బస్ పాస్ కొనుగోలు చేసిన వారిని మాత్రం ఆయా ప్రత్యేక బస్సుల్లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వరు. ఓ వేళ సదరు బస్సులు ఎక్కిన వారిని దింపేస్తారు. ఇది ఆర్టీసీ బస్సుల స్పెషాలిటీ అనే చర్చ ప్రజల్లో సాగుతోంది.