కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:30 AM
రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఆ ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది

తగ్గిన దిగుబడులు
రోజు రోజుకూ పతనమవుతున్న ధరలు
లబోదిబోమంటున్న రైతన్నలు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఆ ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఉల్లి దిగుబడి పూర్తిగా తగ్గిపోయినా, ధర మాత్రం రోజురోజుకు పతనం కావడంపై ఇదేమీ ఘోరమంటూ రైతులు లబోదిబోమంటున్నారు. వాస్తవంగా సప్లయ్ తగ్గినప్పుడు ధర పెరగాలి. అయితే.. సప్లయ్ లేకపోయినా కర్నూలు మార్కెట్‌యార్డులో ఉల్లి ధర తగ్గుతోంది. మంగళవారం కర్నూలు మార్కెట్‌యార్డుకు కేవలం 914క్వింటాళ్ల ఉల్లి మాత్రమే అమ్మకానికి వచ్చింది. రైతులు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంతో ఆశించారు. అయితే.. వ్యాపారులు మాత్రం క్వింటం ఉల్లికి గరిష్టంగా కేవలం రూ.1,109లు, మధ్యస్థ ధర రూ.860 కనిష్ట ధర రూ.505 మాత్రమే రైతుల చేతుల్లో పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఉల్లి పంటను సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వేరుశనగ కాయలకు ప్రభుత్వం రూ.6,550లు మద్దతు ధర ప్రకటిస్తే కర్నూలు యార్డులో గరిష్టంగా రూ.6,491లు, మధ్యస్థ ధర రూ.5,669లు, కనిష్ట ధర రూ.3,070లు మాత్రమే దక్కింది. వాముకు గరిష్ట ధర క్వింటానికి రూ.24,440లు, మధ్యస్థ ధర రూ.11,099లు దక్కింది. మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,250 కాగా, కర్నూలు మార్కెట్‌యార్డులో గరిష్టంగా కేవలం రూ.2,183, మధ్యస్థ ధర రూ.2,154లు, కనిష్ట ధర రూ.2,050లు మాత్రమే దక్కింది. కందులకు కూడా ధర పూర్తిగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం కందుల ధర రూ.9వేల నుంచి రూ.10వేలు ఉండగా.. ప్రస్తుతం క్వింటానికి గరిష్టంగా రూ.7,269లు మాత్రమే దక్కు తుంది. మధ్యస్థ ధర రూ.6,929లు, కనిష్ట ధర రూ.2,729లు దక్కింది. శనగలకు గరిష్ట ధర రూ.5,749లు, మద్యస్థ ధర రూ.5,619లు, కనిష్ట ధర రూ.4,899లు దక్కింది. మిర్చి వివిద రకాలకు క్వింటానికి గరిష్టంగా రూ.11,439 నుంచి రూ.5,490లు మాత్రమే దక్కింది. కొర్రలకు క్వింటానికి గరిష్టంగా రూ.2,029లు, మధ్యస్థంగా రూ.2,019లు, కనిష్ట ధర రూ.1,709లు దక్కింది. మినుములకు గరిష్ట ధర రూ.7,279లు, మధ్యస్థ ధర రూ.6,911లు, కనిష్ట ధర రూ.5,111 పలికింది.