Share News

ఇద్దరు కూలీల మృతి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:31 AM

మహానందిలో మంగళవారం సాయంత్రం వసతి గృహం కూల్చివేత పనులకు వచ్చిన ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.

ఇద్దరు కూలీల మృతి
రాముడు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మహానందిలో వసతి గృహం కూల్చివేత పనుల్లో విషాదం

మహానంది, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మహానందిలో మంగళవారం సాయంత్రం వసతి గృహం కూల్చివేత పనులకు వచ్చిన ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. వీరు కందికాయపల్లెకు చెందిన రాముడు(65), వెంకటేశ్వర్లు(50) ఆలయం అభివృద్ధిలో భాగంగా భక్తుల వసతి కోసం రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న నూతన వసతి గృహం నిర్మాణ పనులకు గతంలో నిర్మించిన నాగనంది సదనం వసతి గృహం కొంత భాగం అడ్డంకిగా మారింది. దీని కోసం రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ అనుమతితో రూ.4.20 లక్షలకు టెండర్‌ ప్రక్రియను కూల్చివేత పనులను కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్‌ నారాయణరెడ్డికి అప్పగించారు. ఇందులో భాగంగానే 10 రోజుల నుండి వసతి గృహాం కొంత భాగాన్ని కాంట్రాక్టర్‌ రెండు ఎక్స్‌కవేటర్లతో పనులను ప్రారంభించాడు. నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన కొంత మంది కూలీలు ప్రతి రోజు కూల్చివేత పనులకు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎక్స్‌కవేటర్‌తో పనులు జరుగుతుండగా ఇద్దరు కూలీలు రాముడు, వెంకటేశ్వర్లు సమీపంలోని వసతి గృహం పై భాగంలో కూర్చొని పిచ్చిపాటి మాట్లాడుకుంటూ ఉండగా ఎక్స్‌కవేటర్‌ తాకిడికి ఉన్న పళంగా అది కూలి పోయింది.

ఈ ప్రమాదంలో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లును దేవస్ధానానికి చెందిన బొలేరో వాహనంలో చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. రాముడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరో మృతుడు వెంకటేశ్వర్లుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ఇటీవల మృతి చెందింది. ఈ సంఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటా మన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 12:31 AM