LPG transporters: గ్యాస్ సిలిండర్ల కొరత
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:45 AM
ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ల సమ్మెతో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా అంతరాయం కలగనుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు నిల్వలు సాఫీగా ఉన్నాయని తెలిపినా, సమ్మె కొనసాగితే కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ల సమ్మె ప్రభావం
1.56 కోట్ల వినియోగదారుల్లో ఆందోళన
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ల సమ్మెతో రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బల్క్ ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన కొత్త టెండర్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ ప్రాంత బల్క్ ఎల్పీజీ ట్రాన్స్‌పోర్టర్లు ఈ నెల 27 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎల్పీజీని రవాణా చేసే ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు రీఫిల్ చేసే బాట్లింగ్ ప్లాంట్లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీల్ తదితర చమురు శుద్ధి కర్మాగారాల నుంచి ఎల్పీజీ రవాణా నిలిచిపోవడంతో ఆయా ప్లాంట్లలో సిలిండర్ల రీ ఫిల్లింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడనుంది. సమ్మె దీర్ఘకాలం కొనసాగితే బాట్లింగ్ ప్లాంట్లలోని ఎల్పీజీ నిల్వలు నిండుకుని రీఫిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోతే గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 1.56 కోట్ల కుటుంబాలు వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నాయి. వీటిలో సుమారు 60 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వం ‘దీపం-2’ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందజేస్తోంది. ట్రైబల్ ప్యాకేజీ కింద మరో 74వేల గిరిజన కుటుంబాలకు సిలిండర్లను అందిస్తోంది. పీఎం ఉజ్వల యోజన కింద దాదాపు 10 లక్షల కుటుంబాలకు వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. సమ్మె కారణంగా వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. సిలిండర్లను రీ ఫిల్లింగ్ చేసే బాట్లింగ్ ప్లాంట్లలో తగినంతగా బల్క్ ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News