TDP: హంతకులకు శిక్ష తప్పదు
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:55 AM
పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతదేహానికి టీడీపీ జెండా, పూలమాల వేయడానికి రాగా.. తమకు న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు చేయబోమని, అవసరమైతే అమరావతికి తీసుకెళతామని కుటుంబీకులు తేల్చిచెప్పారు.

టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి సీఎం భరోసా
ఆ తర్వాతే అంత్యక్రియలకు కదిలిన కుటుంబసభ్యులు
పుంగనూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ అంత్యక్రియలు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం జరిగాయి. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతదేహానికి టీడీపీ జెండా, పూలమాల వేయడానికి రాగా.. తమకు న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు చేయబోమని, అవసరమైతే అమరావతికి తీసుకెళతామని కుటుంబీకులు తేల్చిచెప్పారు. తమ తండ్రిని వేటకొడవలితో నరికి చంపిన వైసీపీ కార్యకర్త వెంకట్రమణ, మరో నలుగురికి వెంటనే ఉరిశిక్ష వేయించాలని, లేకుంటే వారిని తమకు అప్పగించాలని భీష్మించారు. దీంతో సీఎం చంద్రబాబుకు చల్లా ఫోన్‌చేసి విషయం తెలిపారు. సీఎం వెంటనే రామకృష్ణ కుమారులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. ‘అక్కడి విషయాలన్నీ నాకు తెలుసు.. మీరు ధైర్యంగా ఉండండి. హంతకులను అరెస్టు చేయించడానికి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతాను. మీకు టీడీపీ అండగా ఉంటుంది. త్వరలోనే మీ ఇంటికి మంత్రులు, పార్టీ పెద్దలు వచ్చి మాట్లాడతారు’ అని చంద్రబాబు వారికి భరోసా కల్పించారు. రామకృష్ణ మృతి బాధాకరమని సంతాపం వ్యక్తంచేసి.. అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు బాధిత కుటుంబీకులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడారు. హంతకులను వదిలే ప్రసక్తే లేదని, టీడీపీ అండగా ఉంటుందని, న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం రామకృష్ణ మృతదేహంపై టీడీపీ జెండా కప్పి చల్లా.. నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణాపురంలోని వారి పొలంలో రామకృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికారు.
జగన్ హత్యా రాజకీయాలు మానలేదు: లోకేశ్
‘వైసీపీ మూకల దాడిలో మృతిచెందిన రామకృష్ణకు కన్నీటి నివాళి. వైసీసీ రక్తచరిత్రలో టీడీపీ కార్యకర్తను కోల్పోయాం. జనం ఛీ కొట్టినా జగన్ హత్యా రాజకీయాలు మానలేదు. హంతకులకు శిక్ష తప్పదు’ అని ‘ఎక్స్’ వేదికగా మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..