దయనీయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:00 AM
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రబీ సీజన్‌లో 3,041 హెక్టార్లలో వరి సాగు చేసిన రైతులకు 45 వేల టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం 10 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన ధాన్యం ప్రైవేటు మార్కెట్లో అమ్ముకుందామంటే మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరలకు అడుగుతున్నారు. సరేనని తక్కువ ధరకు విక్రయించేందుకు ముందుకు వస్తే సొమ్ము చెల్లింపులు ఆలస్యమవుతాయంటూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన ధాన్యం 1.50 లక్షల టన్నులు రైతుల ఇళ్ల వద్దే దర్శనమిస్తున్నాయి.

-పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతుల అవస్థలు
-జిల్లాలో రబీ సీజన్‌లో 3,041 హెక్టార్లలో వరి సాగు
- 45 వేల టన్నులు వస్తుందని అంచనా
- 10వేల టన్నుల కొనుగోలుకే ప్రభుత్వం అనుమతి
- రైతుల వద్దే ఇంకా ఖరీఫ్ ధాన్యం 1.50 లక్షల టన్నుల నిల్వలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రబీ సీజన్‌లో 3,041 హెక్టార్లలో వరి సాగు చేసిన రైతులకు 45 వేల టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం 10 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన ధాన్యం ప్రైవేటు మార్కెట్లో అమ్ముకుందామంటే మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరలకు అడుగుతున్నారు. సరేనని తక్కువ ధరకు విక్రయించేందుకు ముందుకు వస్తే సొమ్ము చెల్లింపులు ఆలస్యమవుతాయంటూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన ధాన్యం 1.50 లక్షల టన్నులు రైతుల ఇళ్ల వద్దే దర్శనమిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో రబీ సీజన్‌లో వరి సాగుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. కాలువలకు సాగ ునీటిని విడుదల చేయలేదు. అయినప్పటికీ ఏటా మాదిరిగానే గన్నవరం, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, బాపులపాడు తదితర మండలాల్లో 3,041 హెక్టార్లలో బోరునీటి ఆధారంగా రబీ సీజన్‌లో వరిసాగు చేశారు. ఎంటీయూ 1121, 1153, 1156, రకాల వరి వంగడాలతో పాటు పంజాబ్ రకంగా పిలుస్తున్న పీఆర్-126 రకం వరి వంగడాన్ని రైతులు సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో వాతావరణం వరి సాగుకు అనుకూలంగా ఉండటంతో, ఎకరానికి సరాసరిన 48 బస్తాల దిగుబడి వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
10 వేల టన్నుల కొనుగోలుకు అనుమతి
జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు తదితర మండలాల్లో మూడు వేల హెక్టార్లకుపైగా వరి సాగు జరగ్గా, ఈ రబీ సీజన్‌లో 45 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనాగా ఉంది. ఇప్పటికే రబీ సీజన్‌లో సాగు చేసిన వరి కోతకు సిద్ధంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో తాజాగా జిల్లా నుంచి రబీ సీజన్‌కు సంబంధించి 10 వేల టన్నుల ఽధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 45 వేల టన్నుల దిగుబడి అంచనాగా ఉండగా, కేవలం 10 వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెలలో మళ్లీ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా, లేదా అనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం బస్తా ధర రూ.1,625 మాత్రమే..
ఖరీఫ్ సీజన్‌లో 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రభుత్వం ఏ-గ్రేడ్ రకం ఽధాన్యం రూ.1,740, సాధారణ రకం ధాన్యం రూ.1,725 మద్దతు ధరగా నిర్ణయించింది. ధాన్యం కొనుగోలును మార్చి 31వ తేదీతో నిలిపివేయడంతో మిల్లర్లు ధాన్యం ధరలను తమ అదుపులోకి తెచ్చుకున్నారు. జిల్లాలోని మిల్లు యజమానులు, వ్యాపారులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాము ధాన్యం కొనుగోలు చేస్తామని, కానీ బస్తాకు రూ.1,625 మించి ధర ఇవ్వలేమని చెబుతున్నారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ధరకే ధాన్యం కొనుగోలు చేశారు. రెండు, మూడు రోజుల్లో ఈ ధర మరింతగా తగ్గవచ్చని సూచనప్రాయంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు సంకేతాలు పంపుతున్నారు. మండపేట, తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు, మిల్లర్లకు ధాన్యం విక్రయిస్తే బస్తా ధాన్యం రూ.1,550 మించి ధర ఇవ్వడం లేదు, ధాన్యం రవాణా చార్జీలను రైతులే భరించాలని చెప్పి ధాన్యం మద్దతు ధరలో కోతపెడుతున్నారు. ఈ నగదు కూడా ఇప్పుడే ఇవ్వలేమని స్థానికేతరులైన వ్యాపారులు, మిల్లర్లు చెప్పడం గమనార్హం. వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ముఖం చాటేస్తే తమ పరిస్థితి ఏమిటనే అంశంపైనా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఇంకా రైతుల వద్ద 1.50 లక్షల టన్నుల వరకు ఉండగా, రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం 45వేల టన్నుల వరకు వస్తుంది. మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.