ఇక.. ఆర్‌అండ్‌బీ వంతు!
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:02 AM
నిన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియాలను అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చిన విజయవాడ కమర్షియల్ కోర్టు నేడు ఆర్‌అండ్‌బీ శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అమ్మి అయినా కాంట్రాక్టు సంస్థకు నగదు చెల్లించాలని ఆదేశించింది. పక్షం రోజుల డెడ్‌లైన్ విధిస్తూ ఈ లోపు డబ్బులు చెల్లించాలని.. లేని పక్షంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసి, దానిని విక్రయించి కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీకి ఉన్న పరువు కాస్తా పోయినట్టు అయింది. నిబంధనల ప్రకారం చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టు సంస్థలు కమర్షియల్ కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నదానికి తాజా ఉదంతం అద్దం పడుతోంది.

-నిన్న మున్సిపల్ కమిషనర్ బంగ్లా.. నేడు ఆర్‌అండ్‌బీ బంగ్లా!
- అటాచ్ చేస్తామని విజయవాడ కమర్షియల్ కోర్టు హెచ్చరిక
-15వ తేదీ లోపు కాంట్రాక్టు సంస్థకు నగదు చెల్లించాలి
-లేని పక్షంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తాం
- అధికారులకు స్పష్టం చేసిన న్యాయస్థానం
నిన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియాలను అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చిన విజయవాడ కమర్షియల్ కోర్టు నేడు ఆర్‌అండ్‌బీ శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అమ్మి అయినా కాంట్రాక్టు సంస్థకు నగదు చెల్లించాలని ఆదేశించింది. పక్షం రోజుల డెడ్‌లైన్ విధిస్తూ ఈ లోపు డబ్బులు చెల్లించాలని.. లేని పక్షంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసి, దానిని విక్రయించి కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీకి ఉన్న పరువు కాస్తా పోయినట్టు అయింది. నిబంధనల ప్రకారం చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టు సంస్థలు కమర్షియల్ కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నదానికి తాజా ఉదంతం అద్దం పడుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఇంతకు ముందు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్‌టీఎస్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టు సంస్థ కమర్షియల్ కోర్టును ఆశ్రయించటంతో కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియాలను అటాచ్ చేసినట్టు ఏకంగా నోటీసులు అంటించి దండోరా కూడా వేయించిన సంగతి తెలిసిందే. అదే కాంట్రాక్టు సంస్థకు ఆర్‌అండ్‌బీలో కూడా భారీ మొత్తంలో బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో ఆ కాంట్రాక్టు సంస్థ కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆర్ అండ్‌బీ ఉన్నతాధికారులకు విజయవాడ కమర్షియల్ కోర్టు ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ లోపు డబ్బులు చెల్లించని పక్షంలో అటాచ్ తప్పదని స్పష్టం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు, ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) ఉన్నతాధికారుల పరువు గాలిలో కలిసింది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్- గుంటూరు మార్గంలో పూర్వం స్టేహైవే - 2 (ఇప్పుడు ఎన్‌హెచ్ - 167 ఏజీ)గా ఉండేది. ఈ రోడ్డులో నాలుగు హైలెవల్ వంతెనల కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన కాంటెక్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు దక్కించుకుంది. రోడ్డు పనులను తమ సొంత నిధులతో కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. ఈ సంస్థ 2003లో అప్పటి ఆర్‌అండ్‌బీ అధికారులతో అగ్రిమెంట్ అయింది. ఏడాదిలో పనులు పూర్తి చేసింది. దరిమిలా 2004 నుంచి 2013 వరకు దాదాపుగా పదేళ్ల పాటు ఆ సంస్థ టోల్ చార్జీలను వసూలు చేసుకుంది. నిబంధనల ప్రకారం చూస్తే హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ పెరిగిన ప్రతిసారీ ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ టోల్ చార్జీలను పెంపుదల చేసి వసూలు చేయాల్సి ఉంటుంది. హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ పెరిగిన క్రమంలో టోల్ చార్జీల పెంపు కోసం ఆర్‌అండ్‌బీ, రోడ్డు కార్పొరేషన్ తదితర సంబంధిత శాఖలకు కాంట్రాక్టు సంస్థ చార్జీల పెంపునకు అనుమతి కోరింది. ఆ సందర్భంలో చార్జీల పెంపుదలకు పైరెండు శాఖలు అంగీకరించలేదు. ఇలా పదేళ్ల పాటు గడిచిపోయింది. ఈ చర్య వల్ల కాంట్రాక్టు సంస్థకు భారీగా నష్టం జరిగింది. దీనిపై కాంట్రాక్టు సంస్థ నిబంధనల ప్రకారం ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండే క్రమంలో హైదరాబాద్‌లో కమర్షియల్ కోర్టును ఆర్‌అండ్‌బీ అధికారులు ఆశ్రయించగా.. అక్కడ వారి కేసును కొట్టివేయటం జరిగింది. ఆ తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కేసును కొట్టివేయటం జరిగింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా కేసును కొట్టివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. ఆర్‌అండ్‌బీ అధికారులు న్యాయస్థానాలలో వేసిన కేసులు రద్దు కావటంతో కాంట్రాక్టు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తనకు జరిగిన అన్యాయాన్ని తీసుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖను వివరణ కోరింది. ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీ జరిగిన తప్పిదాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ దీనికి సంబంధించి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో కాంట్రాక్టు సంస్థ విజయవాడలోని కమర్షియల్ కోర్టును 2021వ సంవత్సరంలో ఆశ్రయించింది. తనకు జరిగిన నష్టం విలువ రూ.8.94 కోట్లుగా పేర్కొని కోర్టుకు నివేదించింది. కోర్టు విచారించిన మీదట తాజాగా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు ఏప్రిల్ 15వ తేదీ లోపు కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో విజయవాడ బందరు రోడ్డు వెంబడి ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తామని పేర్కొంది. మరి.. ఆర్‌అండ్‌బీ అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన దిద్దుబాటు చర్యలు చేపడతారా? లేక నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్పొరేషన్ ఆస్థులను అటాచ్ చేసినట్టుగా ఏదైనా చేసుకోమని వదిలేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.