Pastor Praveen Kumar: పడుతూ.. లేస్తూ..
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:03 AM
పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ వరుస ప్రమాదాలకు గురైనట్టు సీసీటీవీ ఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. కీసర టోల్‌గేట్, రామవరప్పాడు రింగ్, చిల్లకల్లు టోల్‌గేట్ సమీపాల్లో బుల్లెట్ అదుపు తప్పి పడిపోయిన ఘటనలు రికార్డయ్యాయి. పోలీసులు అన్ని ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.c

వరుస ప్రమాదాలకు గురైన పాస్టర్ ప్రవీణ్ కుమార్
విజయవాడ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు గురైనట్టు సీసీటీవీ కెమెరాల ఫుటీజీలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కీసర టోల్‌గేట్, విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఆయన బుల్లెట్‌పై ప్రయాణిస్తూ అదుపు తప్పి పడిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చిల్లకల్లు టోల్‌గేట్ సమీపంలోనూ ఆయన బుల్లెట్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన మరో సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్చి 24న ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై బయలుదేరారు. తెలంగాణ సరిహద్దు దాటాక ఎన్టీఆర్ జిల్లాలో కీసర టోల్‌గేట్ వద్ద బుల్లెట్ అదుపుతప్పి పడిపోయింది. అక్కడ ఆయనకు ప్రాథమిక వైద్యం చేసిన అంబులెన్స్ సిబ్బంది దీనికిముందు మరో ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఆ మేరకు చిల్లకల్లు టోల్‌గేట్ దాటడానికి ముందే జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా విడుదలైంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు తెలంగాణ సరిహద్దు దాటాక చిలకల్లు టోల్‌గేటులోకి ప్రవేశిస్తాయి.
ఈ టోల్‌గేట్ చేరుకోవడానికి ముందే జగ్గయ్యపేటలోని ఇండస్ట్రియల్ కారిడార్ వద్ద ఉన్న వై జంక్షన్‌లో ప్రవీణ్ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ప్రవీణ్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఆ వెనుకే వస్తున్న బస్సును డ్రైవర్ వెంటనే పక్కకు తిప్పడంతో ప్రవీణ్‌కు పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రవీణ్ ప్రమాద స్థలం నుంచి లేవలేక కాసేపు అలాగే కూర్చుండిపోయారు. వెనుక వచ్చిన వాహనదారులు సాయం చేసేందుకు రాగా, ప్రవీణ్ మెల్లగా లేచి నిల్చున్నారు. ముగ్గురు వ్యక్తులు బుల్లెట్‌ను లేపి రోడ్డు పక్కన స్టాండ్ వేసి నిలిపారు. అనంతరం తూలుతూనే బుల్లెట్ ఎక్కిన ప్రవీణ్ దానిని స్టార్ట్ చేయడానికి కొద్దిసేపు నానా తంటాలు పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇక్కడే కుడి చేయిపై గీసుకున్న గాయమైనట్టు తెలుస్తోంది. తర్వాత ఆయన కీసర టోల్‌గేట్ సమీపంలో, రామవరప్పాడు రింగ్ వద్ద ఇంకోసారి అదుపుతప్పి పడిపోయారని అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీల్లో వెల్లడైంది. సీసీ కెమెరాల ఫుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు.. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ వరుస ప్రమాదాలకు గురైనట్టు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..