ఒకే దేశం-ఒకే ఎన్నిక.. అభివృద్ధికి మార్గం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM
ఒకే దేశం.. ఒకే ఎన్నిక ఆలోచన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఓ మంచి మార్గమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.

మంత్రి సత్యకుమార్
ఒంగోలు నగరం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి) : ఒకే దేశం.. ఒకే ఎన్నిక ఆలోచన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఓ మంచి మార్గమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళా క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఒకే దేశం-ఒకే ఎన్నికపై జరిగిన మేథావుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు విశ్రాంత న్యాయమూర్తి వి.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సదస్సులో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికలు ఒకేసారి జరగకపోవటం వలన అనేక విధాలా నష్టపోతున్నామన్నారు. పలుమార్లు ఎన్నికల కోడ్ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతుందని చెప్పారు. ఎన్నికలు విడివిడిగా జరగటం వలన అభ్యర్థుల ఖర్చుకూడా విపరీతంగా పెరిగిపోతుందన్నారు. దేశంలో వివిధ సమయాల్లో జరుగుతున్న ఎన్నికల ఖర్చు రూ.4.50లక్షల కోట్లు ఉంటుందని, ఒకేసారి నిర్వహిస్తే ఈ ఖర్చును అంతా విద్య, వైద్య రంగాలపై పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని ఉపయోగించుకుని అనేకసార్లు రాష్ట్రప్రభుత్వాలను భర్తరఫ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 2034 నాటికి పూర్తి స్తాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికా బద్దంగా కృషి చేస్తోందన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ పాల్గొన్నారు.