‘బండ’ భారం ఏడాదికి రూ.15 కోట్లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:18 AM
జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.50 పెంచింది. దీంతో ప్రజానీకంపై భారీగా భారం పడనుంది.

గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన కేంద్రం
ఒక్కోదానిపై రూ.50 వడ్డింపు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.50 పెంచింది. దీంతో ప్రజానీకంపై భారీగా భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా మూడు కంపెనీల పరిధిలో సుమారు 7.5 లక్షల గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున నాలుగు సిలిండర్ల వరకు వినియోగిస్తుంది. దీంతో రూ.200 వరకూ ఖర్చు పెరగనుంది. ఆవిధంగా జిల్లావ్యాప్తంగా ప్రజానీకంపై ఏడాదికి రూ.15కోట్ల మేర భారం పడనుంది. పెంచిన ధర మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. జిల్లాకేంద్రమైన ఒంగోలులో సోమవారం సిలిండర్ ధర రూ.848 ఉండగా మంగళవారం అది రూ.898కి చేరింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు ధరలు పెరుగుతాయో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పుడు కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.