పత్తి రైతుపై విత్తన భారం..!
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:51 PM
రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించడానికి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

పత్తి విత్తనాల ప్యాకెట్ మీద రూ.37 పెంపు
ప్రస్తుత రూ.864.. వచ్చే ఖరీఫ్ నుంచి రూ.901
ఉమ్మడి జిల్లాలో రెండున్నర లక్షల హెక్టార్లలో పత్తిసాగు
15 లక్షల ప్యాకెట్ల అవసరం
పత్తి రైతుపై విత్తన భారం రూ.6.50 కోట్లు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించడానికి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విత్తనాలు, క్రిమిసంహారక మందుల తయారీ కంపెనీల యాజమాన్యాలకు మాత్రం వాటి ధరలు పెంచుకునే అనుమతి ఇస్తోంది. ఖరీఫ్‌లో సాగయ్యే పత్తి విత్తన తయారీ సంస్థలకు ధరలు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి దాకా ఒక ప్యాకెట్ పత్తి విత్తనం ధర 475 గ్రాములు వచ్చే ఖరీఫ్ నుంచి రూ.901 వరకు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక ప్యాకెట్‌పై రూ.37 అదనంగా పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ రెండున్నర లక్షల హెక్టార్లకు దాదాపు 15 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం. పెంచిన ధర ప్రకారం ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులపై రూ.6.50 కోట్ల దాకా అదనపు భారం పడనుంది.
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ, పాణ్యం, నందికొట్కూరు, డోన, నంద్యాల తదితర నియోజకవర్గాల్లో దాదాపు ఖరీఫ్‌లో రెండున్నర లక్షల హెక్టార్లలో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే పత్తి పంట సాగులో రైతులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ఎకరా పత్తి పంట సాగుకు దాదాపు 20 నుంచి 30వేల దాకా ఖర్చు చేస్తున్నా గిట్టుబాటు కావడం లేదు. సీసీఐ అధికారులు రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ఏటా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటం పత్తికి రూ.7,521 మద్దతు ధరగా ప్రకటించింది. ఈ ధరను అందించేందుకు కాటన కార్పొరేషన ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటం పత్తిని రూ.6వేల నుంచి రూ.6,500లకు విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో తమపై మరింత భారం పెంచేలా విత్తన ధరను పెంచుకునేందుకు పత్తి విత్తన తయారీ యజమానులకు కేంద్రం అనుమతించడాన్ని రైతుఉ విమర్శిస్తున్నారు.
ఫ నల్లరేగడి భూముల్లోనే పత్తి సాగు:
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 75 శాతం నల్లరేగడి భూములు ఉన్నాయి. ఈ భూములు పత్తి పంట సాగుకు ఎంతో అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసేవారు. కాలక్రమేణా ఆ పంటలు గిట్టుబాటు కాకపోవడంతో కేంద్రం పత్తికి మద్దతు ధరను క్వింటానికి రూ.7,500 పెంచడం వల్ల గత ఐదేళ్ల నుంచి పత్తి పంట విస్తీర్ణం ఉమ్మడి జిల్లాలో భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం రెండున్నర లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు.
ఫ గత ఆరేళ్లుగా పెరిగిన పత్తి విత్తన ధరలు :
------------------------------------------------------------------
సంవత్సరం ఒక ప్యాకెట్ ధర (450 గ్రాములు)
------------------------------------------------------------------
2020 రూ.730లు
2021 రూ.767
2022 రూ.810
2023 రూ.853
2024 రూ.864
2025 రూ.901 (వచ్చే ఖరీఫ్‌కు ధర)
------------------------------------------------------------------
పత్తి ధర ఖరీఫ్ నుంచి అమలులోకి వస్తుంది - వరలక్ష్మి, వ్యవసాయ శాఖ కర్నూలు జేడీ:
కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ధరను పెంచేందుకు పత్తి విత్తన తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఒక ప్యాకెట్ (450 గ్రా) ధర ఇప్పటి దాకా రూ.864 ఉండగా.. ఇకపై రూ.901కు పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు వచ్చే ఖరీఫ్‌కు అమలవుతాయి. రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా డీలర్ల నుంచి రశీదు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, నాసిరకం విత్తనాలు విత్తిన సమయంలో పంట ఏపుగా పెరగకపోతే సంబంధిత పత్తి కంపెనీల నుంచి నష్టపరిహారం అందుకునేందుకు డీలర్ల నుంచి తీసుకున్న రశీదు ఆధారంగా ఉంటుంది.