Share News

Rims: రోగులైనా.. మెట్లు ఎక్కాల్సిందే

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:47 AM

rims problems శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో సమస్యలు తిష్ఠ వేశాయి. ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆస్పత్రిని సందర్శించి.. ఎన్ని ఆదేశాలు జారీచేసినా తీరు మారని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువవుతున్నాయని, వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rims: రోగులైనా.. మెట్లు ఎక్కాల్సిందే
రిమ్స్‌లో లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో మెట్ల మార్గంలో వెళ్తున్న రోగులు

రిమ్స్‌లో పనిచేయని లిఫ్ట్‌లు

ఒక్క అటెండర్‌తోనే నిర్వహణ

పూర్తిస్థాయిలో లేని ఎలక్ర్టీషియన్లు

విద్యుత్‌ సమస్యలతో అవస్థలు

అరసవల్లి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో సమస్యలు తిష్ఠ వేశాయి. ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆస్పత్రిని సందర్శించి.. ఎన్ని ఆదేశాలు జారీచేసినా తీరు మారని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువవుతున్నాయని, వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రోగులైనా సరే అతి కష్టమ్మీద మెట్టు ఎక్కి.. ఆయా విభాగాల వైద్యుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. రిమ్స్‌లో మొత్తంగా 5 లిఫ్ట్‌లు ఉన్నాయి. 24 గంటలు పని చేయాల్సిన లిఫ్ట్‌లకు కేవలం ఒక్క లిఫ్ట్‌ అటెండర్‌ మాత్రమే ఉన్నాడు. ఐపీ బిల్డింగ్‌లో లిఫ్ట్‌ చాలా కాలంగా పనిచేయడం లేదు. రెండు రోజులుగా ఓపీ దగ్గర లిఫ్ట్‌లు కూడా మొరాయిస్తున్నాయి. కాలం గడుస్తున్నా.. లిఫ్ట్‌ల నిర్వహణకు సంబంధించి కనీస సిబ్బందిని నియమించడం లేదు. లిఫ్ట్‌లు పనిచేయక రోగులు మెట్ల మార్గంలోనే నడుస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ముగ్గురు ఎలక్ట్రీషియన్లతో ఎలా...?

930 పడకల గల రిమ్స్‌ ఆస్పత్రిలో కనీసం 10మంది ఎలక్ట్రీషియన్లు ఉండాలి. కానీ రెగ్యులర్‌ ఒక్కరు, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆస్పత్రిలో రెండు భవనాలకు సంబంధించి మొత్తంగా 8 ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌తో కలిపి మొత్తం 10 ఉన్నాయి. 23 విభాగాలు, ఐసీయూ కేంద్రాలు 8, ఆపరేషన్‌ థియేటర్లు 14, వార్డులు 35 ఉండగా కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెడితే పరిస్థితి మరింత దారుణం. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లోనూ విద్యుత్‌ బోర్డులకు సంబంధించి పలు సమస్యలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల స్విచ్‌లు పనిచేయడం లేదు. ఫ్యాన్‌లు తిరగడం లేదు. అసలే వేసవి కావడంతో ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు వాపోతున్నారు.

అగ్నిప్రమాదం సంభవిస్తే...

ఆస్పత్రిలో పొరపాటున అగ్నిప్రమాదం సంభవిస్తే అదుపు చేయడానికి కావలసిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వినియోగించేందుకు సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం. కనీస సిబ్బంది లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా రోజులు నెట్టుకొస్తున్నారో... అధికారులు, నాయకులకే తెలియాలి.

ప్లంబర్‌ ఒక్కడే.?

ఆస్పత్రి మొత్తానికి ఒక్కరే ప్లంబర్‌ పని చేస్తున్నాడు. తాగునీటి ప్లాంట్‌లు, బాత్‌రూమ్‌లు, పైపులైన్ల మరమ్మతుల పనులు ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. పారిశుధ్య లోపం, నీటి సరఫరా సక్రమంగా లేక రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వైద్యసేవలు మాట దెవుడెరుగు.. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

త్వరలోనే పరిష్కారం

ఆస్ప్రతిలో ఎలక్ట్రికల్‌, లిఫ్ట్‌లకు సంబంధించి అదనపు సిబ్బంది అవసరమని గుర్తించాం. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయి.

డాక్టర్‌ షకీలా, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Updated Date - Apr 06 , 2025 | 12:47 AM