పిచ్చుకా.. ఎక్కడున్నావ్?
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:41 PM
ఒకప్పుడు సూర్యోదయ సమయాన ఇళ్ల ముందు కిచకిచమంటూ వాటి కిలకిలా రావాలు. సాయం సంధ్య వేళను గుర్తు చేస్తూ గుంపులుగా ఆకాశంలో వాటి విహారం.

ఒకప్పుడు సూర్యోదయ సమయాన ఇళ్ల ముందు కిచకిచమంటూ వాటి కిలకిలా రావాలు. సాయం సంధ్య వేళను గుర్తు చేస్తూ గుంపులుగా ఆకాశంలో వాటి విహారం. ఇంటికి వచ్చే అతిథిని గౌరవించినట్టు ఇళ్ల ముందర.. తోటలు.. పొలాల్లో వాటి కోసం వేలాడే వరి కంకులు.. ఇదీ పిచ్చుకలతో మనిషి అనుబంధం. కాలంతో పాటు మన జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులు.. పెరిగిన సాంకేతికత వాటి మనుగడకు ముప్పు కలిగిస్తోంది. దీంతో ఇవి ఎక్కడ కనిపిస్తాయా అని వెతుక్కోవడం మనవంతవుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి.. రైతులకు ఎంతో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
హరిపురం/ పలాస/ హిరమండలం/ మార్చి 19(ఆంధ్రజ్యోతి)
పల్లెల పేరు చెబితే పచ్చని పైరులే కాదు... కిచకిచమంటూ మన చుట్టూ తిరుగుతూ సందడి చేసే ఓ బుజ్జి పిట్ట కూడా గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు మన జీవనంలో భాగమై... ప్రస్తుతం అంతరించిపోయే జాతుల్లో చేరి... మనుగడ కోసం పోరాడుతున్న ఆ బుజ్జి పిట్ట పేరు పిచ్చుక. పిచ్చుకలు చిన్నగా.. బొద్డుగా.. ఊదారంగులో.. పింఛంలాంటి తోకతో.. ఒకనాడు పంటచేలల్లో.. పల్లెముంగిళ్లలో...ధాన్యపు రాశుల మధ్య సందడి చేసేవి. ఇళ్ల ముంగిట గింజలు తింటూ.. గుంపులుగా ఉండే పిచ్చుకలు ఏదో అలికిడి అయితే చాలు తుర్రుమని ఎగిరే దృశ్యాలు చూడముచ్చటగా ఉండేవి. ఇప్పుడు పచ్చని చెట్ల స్థానాన్ని కాంక్రీట్ వనాలు ఆక్రమించాయి. ఇవి పక్షుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఆహారంతో పాటు ఆవాసాలు కరువై ఇప్పటికే ఎన్నో పక్షి జాతులు అంతరించిపోయాయి. ఇంటి పక్షిగా పేరొందిన పిచ్చుకలదీ ప్రస్తుతం అదే పరిస్థితి. మన సాంకేతిక పరిజ్ఞానం నుంచి వస్తున్న రేడియేషన్... మనం సృష్టిస్తున్న కాలుష్యంతో పోరాడే శక్తి లేని ఈ చిట్టి పక్షులు చల్లని ప్రదేశాలకు వలస వెళ్లడమే కాకుండా.. ప్రాణాలూ పోగొట్టుకుంటున్నాయి. ఉండేందుకు కాస్త చోటు, తినేందుకు ఆహారం.. తాగేందుకు నీరు అందుబాటులో ఉంచితే ఈ జాతిని కొన్నాళ్లయినా కాపాడుకోవచ్చు. పిచ్చుకలు అన్యోన్యతకు.. ఆదర్శానికి మారుపేరుగా నిలవటంతోపాటు రైతుల నేస్తాలుగా.. మనిషితో మమేకమవటంతో దీన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు ఏటా మార్చి 20న ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేసింది.
మానవ జీవన శైలిలో వచ్చిన సమూల మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, పూరిళ్లు, రసాయనాలతో కలగలిసిన పండ్లు, ఆహార ఽధాన్యాలపై పురుగు మందుల పిచికారీ వంటివి వీటికి ముప్పు కలిగి స్తున్నాయి. ఇక సెల్ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్. అయస్కాంత తరంగాలు వాటి ఉనికికే ముప్పుగా మారాయి. పూరిళ్లలో పిచ్చుకలకు ఆహారంగా వేలాడదీసే వరికంకులు లేక, పంటలు పండక.. నివాస స్థలాలే కరువవుతున్నాయి. దీంతో ఇవి ప్రస్తుతం గ్రామాల్లో సైతం సరిగా కనిపించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో వాహనాల కాలుష్యం, చెట్లు లేకపోవడం, అపార్ట్‌మెంట్లు వెలుస్తుండటంతో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.
గూడంటే గూడూ కాదు..
గిజిగాడు(పిచ్చుక) గూడు ప్రత్యేకమైనది. ఇవి ఇంజనీరింగ్ ప్రతిభతో ఈత, తుమ్మ, తాటి, కొబ్బరి చెట్ల కొమ్మల చివరన ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను తెచ్చుకుని అత్యంత నైపుణ్యంతో గూడు కట్టుకుంటాయి. గూడు బాగుంటేనే ఆడపక్షి... మగపక్షితో జత కడుతుందంటారు. పిచ్చుక గూటికి మార్గం కింది నుంచి ఉంటుంది. ఈ గూడు లోపల వెచ్చగా ఉండడంతో పాటు వానవచ్చినా తడవకపోవడం ప్రత్యేకత. బోర్లు, కుళాయిలు వచ్చాక ఊళ్లలో బావులను పూడ్చేయడం.. సాగు పేరుతో ఒక్క అంగుళాన్నీ వదలకుండా.. కొందరు ఇవి గూడు కట్టుకొనే చెట్లను నరికి వీటికి నష్టం కలిగిస్తున్నారు. దీంతో ఇవి గూడు కట్టుకోవడానికీ చోటు దొరకడం లేదు.
ప్రభుత్వం గుర్తించింది..
పిచ్చుకలను అంతరించిన జాబితాలో ఇప్పటికే కలిపారు. వీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం జూలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జూలలో వీటి నివాసానికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి జాతి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. పలాసలో అటవీశాఖ నిర్వహించే పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే జాతిని ఆదుకోవచ్చు.
- మురళీకృష్ణంనాయుడు, ఫారెస్ట్ రేంజర్, కాశీబుగ్గ
నీరు అందిస్తే చాలు..
మానవ జీవన మనుగుడకు జీవవైవిధ్యం ప్రధానం. మనతోపాటు అన్నిరకాల పక్షులు ఉంటేనే సమతుల్యత ఏర్పడుతుంది. పిచ్చుకల కోసం తాగునీరు, వరికంకులు ఇళ్ల ముందర చెట్లకు వేలాడదీసి... వాటికి రక్షణ కల్పించవచ్చు. ఏడాది పొడవునా మా పరిసరాల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. వీటిని విరివిగా పెంచుతున్నాం. పెంపుడు కోళ్ల కంటే ఇవి ఎక్కువ మచ్చికగా ఉంటాయి.
- ఎస్.భీమారావు, పక్షి ప్రేమికుడు, సువర్ణాపురం
ఐదేళ్లుగా.. నీరు పెడుతూ..
హరిపురం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన పుల్లా వాసుదేవు మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. తన దుకాణం ఎదురుగా చెట్టును నాటి... దాని మొదలులోనే ఒక పెట్టెను ఏర్పాటు చేసి రోజూ నీరు పెడుతున్నాడు. పదేళ్ల కిందట ప్రారంభించిన ఈ చిరు ప్రయత్నం.. నేటికీ కొనసాగుతునే ఉంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నీరు పోసి చిన్న పక్షులు, పిచ్చుకలను ఆదుకుంటున్నాడు. ఈ నీటిని పక్షులు తాగుతుంటే ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో సైతం పక్షులు ఈ చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.
బీలలో పిచ్చుక గూళ్లు
సోంపేట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఎక్కడ చూసినా పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఇప్పుడు మచ్చుకైనా లేవు. కానీ సోంపేట మండలం బీల ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా ఈ గూళ్లు కనిపిస్తున్నాయి.