Share News

soil: ఏం పర్లేదు.. ఫైన్‌ కడతాం

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:50 PM

Illegal Sand Transportation జిల్లాలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఏడు నెలలుగా అధికంగా వంశధార నది నుంచి ఇసుకను విశాఖ, ఒడిశాకు తరలిస్తున్నారు. ట్రాక్టర్లు పట్టుబడితే అధికారులు కొంతమేర అపరాధ రుసుం వసూలు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తర్వాత యథావిధిగా ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

soil: ఏం పర్లేదు.. ఫైన్‌ కడతాం
హిరమండలంలో పట్టుబడిన ఒడిశా ట్రాక్టర్లు

  • జరిమానాలకు వెరవని ఇసుక వ్యాపారులు

  • డబ్బులు కట్టేసి మళ్లీ అక్రమంగా తరలింపు

  • అధికారుల నామమాత్రపు చర్యలే కారణం

  • హిరమండలంలో 16 ట్రాక్టర్లు పట్టివేతతో అలజడి

  • మళ్లీ కొత్త దారుల కోసం అన్వేషణ

  • ‘మీరు దాడులు చేయండి. జరిమానా విధించండి. ఏం పర్లేదు.. డబ్బులు కట్టేస్తాం. ఆతర్వాత మాదారి మాదే’.. ఇదీ జిల్లాలో ఇసుక వ్యాపారుల తీరు. అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని నామమాత్రపు చర్యలతో సరిపెడుతండడంతో వారి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫైన్‌ కట్టేసి మళ్లీ కొత్త మార్గాల్లో ఇసుక తవ్వుకుని పోతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా వీరికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఏడు నెలలుగా అధికంగా వంశధార నది నుంచి ఇసుకను విశాఖ, ఒడిశాకు తరలిస్తున్నారు. ట్రాక్టర్లు పట్టుబడితే అధికారులు కొంతమేర అపరాధ రుసుం వసూలు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తర్వాత యథావిధిగా ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. తాజాగా గురువారం హిరమండలంలో 16ట్రాక్టర్లు పట్టుబడడంతో ఇసుకాసురులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాము ఎవరిని పట్టుకోవాలని, ఇసుకను ఎలా తరలించాలని కొత్తదారులు వెతుకుతున్నారు. వంశధార నది నుంచి ఒడిశాకు చెందిన సుమారు 25 ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రోజూ హిరమండలం నుంచి పాతపట్నం, మెళియాపుట్టి మీదుగా ఒడిశాకు రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు పట్టుబడకుండా ఇసుక ట్రాక్టర్లకు రెండు కిలోమీటర్లు దూరంలో ముందుగా పైలట్‌ వాహనాన్ని నడుపుతున్నారు. ఎక్కడైనా తనిఖీలు చేస్తున్నట్టు పైలట్‌ సమాచారం అందిస్తే.. మరో మార్గంలో ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. దీనిపై గత నెల 29న ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. గురువారం రాత్రి హిరమండలంలో వంశధార నది వద్ద తవ్వకాలు చేపడుతున్న 16 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10వేల అపరాధ రుసుం వసూలు చేయాలని భావించారు. దీంతో కొంతమంది ట్రాక్టర్ల యాజమానులు అధికారపార్టీ నేతలను ఆశ్రయించినట్టు తెలిసింది. వారి ఒత్తిడి మేరకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేలు మాత్రమే అపరాధ రుసుం వసూలు చేసి వదిలేశారు. కాగా, ట్రాక్టర్ల యజమానులు అపరాధ రుసుం కడుతున్నా.. ఇసుక అక్రమ తరలింపు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది అధికారులకు మామూళ్లు ముట్టచెప్పి.. ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Apr 04 , 2025 | 11:50 PM