Share News

Zp meeting : సమస్యలపై చర్చిస్తారా?

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:23 PM

Issues discussion జిల్లా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదిక.. జడ్పీ సర్వసభ్య సమావేశం మంగళవారం జడ్పీ హాల్‌ నిర్వహించనున్నారు. వైసీపీ పాలనలో జడ్పీ సర్వసభ్య సమావేశానికి కీలక ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడంతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టేవి. రాజకీయ చర్చలు, చిన్నపాటి అంశాలకే పరస్పర ఆరోపణలతో విలువైన సమయం వృథా అయ్యేది.

Zp meeting : సమస్యలపై చర్చిస్తారా?
జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం

  • నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

  • వైసీపీ పాలనలో సిక్కోలుకు ఒరిగిందేమీ లేదు

  • గతంలో సమావేశానికి కీలక ప్రజాప్రతినిధులు దూరం

  • ఈసారైనా మోక్షం చూపాలని జిల్లావాసుల విజ్ఞప్తి

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదిక.. జడ్పీ సర్వసభ్య సమావేశం మంగళవారం జడ్పీ హాల్‌ నిర్వహించనున్నారు. వైసీపీ పాలనలో జడ్పీ సర్వసభ్య సమావేశానికి కీలక ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడంతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టేవి. రాజకీయ చర్చలు, చిన్నపాటి అంశాలకే పరస్పర ఆరోపణలతో విలువైన సమయం వృథా అయ్యేది. గత ఐదేళ్లు గ్రామ, మండల, నియోజకవర్గ అభివృద్ధికి తీసుకున్న చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది సమీపిస్తుండగా.. గత రెండు జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో కీలక ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. దీంతో కొంతమంది మండలస్థాయి ప్రజాప్రతినిధులు.. ఈ సమావేశాన్ని రాజకీయ చర్చలకు దారితీసేలా వ్యవహరించారు. కాగా నేడు నిర్వహించనున్న సమావేశానికి పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొనున్నారు. ఈసారైనా.. జిల్లాలో ప్రధాన సమస్యలపై సభ్యులు, ప్రజాప్రతినిధులు చర్చించి.. పరిష్కార మార్గం చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • ఇవిగో సమస్యలు..

  • జిల్లావాసులను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో డ్రైనేజీ వ్యవస్థ బ్రిటీష్‌ కాలం నాటిది. అప్పుడప్పుడు.. కొన్ని కాలువలను ఆధునికీకరిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ లేదు. దీంతో వర్షం పడితే ప్రధాన జంక్షన్లు నీట మునిగిపోతున్నాయి. నగరం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

  • ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జిల్లాకే పెద్దదిక్కు. కానీ ఆ స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ట్రామా కేర్‌లో అవసరమైన వైద్య సిబ్బంది లేరు. ఓపీ చూడాల్సిన వైద్యులు అధికమంది.. మొబైల్‌లో ఆసుపత్రి ప్రాంగణంలో హాజరువేసేసి అక్కడ నుంచి సొంత ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. సాయంత్రం మళ్లీ సమయానికి వచ్చి ఎఫ్‌ఎల్‌ఆర్‌ఎస్‌లో హాజరువేసేసి వెళ్లిపోతున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు జూనియర్లు వైద్యులు సేవలందిస్తున్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరగాల్సి ఉంది.

  • పలాస కిడ్నీరీసెర్చ్‌ సెంటర్‌లో కీలక వైద్య నిపుణులు, అవసరమైన సిబ్బంది లేక సేవలు సక్రమంగా అందడం లేదు. తక్షణమే సిబ్బందిని నియమించాలి.

  • ప్రైవేటు ఆసుపత్రిల్లో సిజేరియన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని పీహెచ్‌సీలలో ఒకటీ.. రెండు మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలి.

  • శ్రీకాకుళం మండలంలో నర్శింగ్‌ కళాశాల కోసం నిర్మించి వదిలేసిన భవనాన్ని వినియోగంలోకి తేవాలి.

  • వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 పనులు శరవేగంగా పూర్తిచేయాలి. సాగునీటిని పూర్తిస్థాయిలో విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్ట, తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు కలగా మారుతోంది. కాలువల ఏర్పాటు.. పాత కాలువలను చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలు గత ప్రభుత్వంలో లేవు. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి.

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో కళ్లేపల్లి, కళింగపట్నం సముద్రతీరాలను అభివృద్ధి చేయాలి.

  • పల్లె ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు ఎక్కువయ్యాయి. ఎక్సైజ్‌ అధికారులు కేవలం నాటుసారా తయారీదారులపైనే కాకుండా బెల్టు దుకాణదారులపైనా చర్యలు తీసుకోవాలి.

  • గత ప్రభుత్వ హయాంలో జగనన్న ఇళ్ల కాలనీల్లో స్థలాల కేటాయింపు నుంచి.. అక్కడ నిర్మాణాల్లోనూ పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వైసీఈ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుని భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారు. శ్రీకాకుళం నగర ప్రజలకు ఇచ్చిన స్థలాల్లో ఇటువంటి అక్రమాలు అధికంగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలి.

  • జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో భాగంగా ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం వరకు.. మండల కేంద్రాల్లోనూ రోడ్లును ఇష్టానుసారంగా తవ్వేశారు. పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. ప్రజలకు ఇప్పటికీ తాగునీరు పూర్తిస్థాయిలో అందడంలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలి.

  • వేసవిలో తాగునీటి సమస్య జఠిలం కాకముందే నదుల్లో .. వంతెనల వద్ద .. తాగునీటి ప్రాజెక్టు ఇన్‌ఫిల్టర్‌ బావుల వద్ద ఇసుక తవ్వకాలపై నిషేధాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలి. అలాగే పాడైన రక్షిత పథకాలను సకాలంలో బాగుచేయాలి.

  • పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార నదిలో.. కొన్ని పంచాయతీల్లో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.

  • ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును పరుగులెత్తించాలి. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు, నదుల అనుసంధాన ప్రక్రియ చేపట్టాలి. సమగ్ర కలెక్టరేట్‌ వినియోగంలోకి తేవడం.. ఆక్రమణకు గురవుతున్న చెరువులు.. వీటన్నింటిపై చర్చ జరగాలి. అప్పుడే జిల్లా ప్రజలకు సమస్యల బారి నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.

Updated Date - Apr 07 , 2025 | 11:23 PM