Share News

సూపర్‌ బజార్‌లో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:14 AM

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్‌ (సూపర్‌ బజార్‌) అక్రమాల కేంద్రంగా మారింది.

 సూపర్‌ బజార్‌లో ఇష్టారాజ్యం

  • మరమ్మతుల పేరిట నాలుగేళ్లలో రూ.60 లక్షల వ్యయం

  • కంటెంజెన్సీ పేరిట మరో రూ.55 లక్షలు

  • ఆఫీసు నిర్వహణ ఖర్చులు రూ.35 లక్షలు

  • బిల్లులు పెట్టుకొని డబ్బులు తీసుకోవడమే పని

  • జీసీసీ డిపోలకు సరకులు సరఫరా చేసే ట్రేడర్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా చెల్లింపులు

  • జాయింట్‌ కలెక్టర్‌కు చెప్పకుండానే ఆర్థిక వ్యవహారాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్‌ (సూపర్‌ బజార్‌) అక్రమాల కేంద్రంగా మారింది. పాలకవర్గం లేకపోవడంతో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇష్టానుసారం వ్యవహారాలు నడుస్తున్నాయి. జాయింట్‌ కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉన్నా ఆయన దృష్టికి ఏమీ తీసుకువెళ్లకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో సుమారుగా రెండు కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయంటూ జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి.

ఏటా మరమ్మతులే

సూపర్‌బజార్‌ ప్రాంగణంలో షాపింగ్‌ మాల్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, కింద రెడీమేడ్‌ దుస్తుల షాపు, సూపర్‌ బజార్‌, ఫర్నీచర్‌ షాపు, చిన్న చిన్న షాపులు కొన్ని ఉన్నాయి. వీటిలో సూపర్‌ బజార్‌, చిన్న షాపులకు మాత్రమే మరమ్మతులు చేస్తుంటారు. ఇంకా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. 2020కి ముందు నాలుగేళ్లలో ఈ ప్రాంగణం నిర్వహణ, మరమ్మతులకు సుమారు రూ.4.5 లక్షలు ఖర్చు కాగా, ఇప్పుడున్న మేనేజింగ్‌ డైరెక్టర్‌ వచ్చాక నిర్వహణ, మరమ్మతుల పేరుతో ఇప్పటివరకూ రూ.60,35,000 ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారు. ఈ నిధులతో కొత్తగా ఒక భవనమే నిర్మించవచ్చునని, అంతేసి మొత్తాల ఖర్చుకు పర్సన్‌ ఇన్‌చార్జి ఆమోదం కూడా లేదని జేసీకి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కంటింజెన్సీ, ఆఫీస్‌ నిర్వహణ

సూపర్‌ బజార్‌ ఆఫీస్‌ నిర్వహణ, కంటింజెన్సీ (అత్యవసర/ఆకస్మిక) ఖర్చులకు కలిపి ఈ ఐదేళ్లలో రూ.91 లక్షలకు పైగా బిల్లులు పెట్టినట్టు సమాచారం. అందులో కంటింజెన్సీ ఖర్చులు రూ.55,75,000 కాగా నిర్వహణ వ్యయం రూ.35, 30,000గా చూపించారు. అంటే ఏడాదికి ఆఫీస్‌ నిర్వహణ కోసమే 18 లక్షల వరకూ ఖర్చు చేసినట్టు. అంటే నెలకు రూ.1.5 లక్షలు. పర్సన్‌ ఇన్‌చార్జి ఆఫీస్‌ నిర్వహణ కోసం కూడా ఇంత ఖర్చు ఉండదని సిబ్బంది గుసగుసలాడుతున్నారు.

సరకులు సరఫరా చేయకుండానే నిధులు

విశాఖ ఏజెన్సీలో జీసీసీ నిర్వహించే డిపోలకు కిరాణా సరకులను సూపర్‌ బజారు సరఫరా చేస్తుంది. ఆ బాధ్యత ట్రేడర్లకు అప్పగిస్తుంది. వారు సరకులు సరఫరా చేశాక, ఆ మొత్తం డిపోల నుంచి సూపర్‌ బజారుకు జమ అయ్యాక, తన కమీషన్‌ మినహాయించుకుని మిగిలిన మొత్తం ట్రేడర్లకు ఎండీ అందజేస్తారు. ఇది అమలులో ఉన్న విధానం. ఇలా ఈ సరకులు రవాణా కోసం ఆస్కార్‌ ఎంటర్‌ప్రైజస్‌, పీవీఆర్‌ ట్రేడర్స్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరు డిపోలకు అందించిన సరకులకు సంబంధించిన నగదు ఏజెన్సీ నుంచి సూపర్‌బజార్‌ ఖాతాకు జమ కాక ముందే...సుమారు రూ.65 లక్షల వరకు ఆ రెండు సంస్థలకు విడుదల చేశారనే అభియోగం ఉంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఆ ట్రేడర్లతో ఉన్న లోపాయికారీ అవగాహన వల్లే ఇలా చేశారని, ఇప్పుడు కొద్దికొద్దిగా ఆ మొత్తాలను తెచ్చి కడుతున్నారని జేసీకి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఈ ఐదేళ్లలో సుమారు రూ.2.17 కోట్లు దుర్వినియోగం జరిగిందని, ఎండీని పోస్టు నుంచి తప్పించి, పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:14 AM