Share News

అర్హులకు పింఛన్ల మంజూరులో జాప్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:19 AM

సామాజిక పింఛన్ల మంజూరులో జాప్యంపై పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.

అర్హులకు పింఛన్ల మంజూరులో జాప్యం

  1. జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల ఆందోళన

  2. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని వినతి

  3. కేజీహెచ్‌ మార్చురీలో పోస్టుమార్టం

  4. ఆలస్యం అవుతోందన్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

మహారాణిపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్ల మంజూరులో జాప్యంపై పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు ఎందుకు మంజూరుచేయడం లేదన్న సభ్యుల ప్రశ్నకు డీఆర్‌డీఏ అధికారులు వివరణ ఇస్తూ...ఉమ్మడి జిల్లాలో కొత్త పింఛన్లకు అర్హులతో జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. పక్కా ఇళ్ల కోసం పలువురు పేదలు ఎదురుచూస్తున్నారని కొందరు సభ్యులు చెప్పగా...ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే పూర్తయిన తరువాత కొత్తగా లబ్ధిదారులను గుర్తిస్తామని గృహ నిర్మాణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లు డబ్బులను వెంటనే విడుదల చేయాలని చైర్‌పర్సన్‌ కోరారు.

కేజీహెచ్‌ మార్చురీలో పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోందని చైర్‌పర్సన్‌ అనగా...సూపరింటెండెంట్‌ శివానంద స్పందిస్తూ...పోలీసులు శవపంచనామా చేసిన తరువాతే పోస్టుమార్టం చేయాలని, అందువల్ల ఆలస్యం అవుతున్నదని చెప్పారు. అయినప్పటికీ జాప్యం లేకుండా పోస్టుమార్టం పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్‌లో వైద్యం కోసం వచ్చే గిరిజనులకు విశ్రాంతి హాలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించామని, గిరిజనులు దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ఉండడంతో పలు శాఖల అధికారులకు బదులు సిబ్బంది, ద్వితీయశ్రేణి అధికారులు సమావేశాలకు హాజరయ్యారు.


చర్లపల్లి మీదుగా రైళ్ల రాకపోకలు

ఇకపై ఎల్‌టీటీ, నాందేడ్‌, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు సికింద్రాబాద్‌ వెళ్లవు

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

చర్లపల్లి స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించేలా పలు రైళ్లను శాశ్వత ప్రాతిపదికన దారిమళ్లిస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఏప్రిల్‌ 22 నుంచి లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18520), 24 నుంచి విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (08519) రైళ్లు చర్లపల్లి, అమ్మగూడ, సనత్‌నగర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు మౌలాలి, సికింద్రాబాద్‌ స్టేషన్లకు వెళ్లవు. అలాగే ఏప్రిల్‌ 24 నుంచి విశాఖ-సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503), 25 నుంచి సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18504), సంబల్‌పూర్‌-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ (20809), 26 నుంచి నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20810), విశాఖ-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ (20811), 27 నుంచి నాందేడ్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (20812) రైళ్లు చర్లపల్లి, మౌలాలి జి క్యాబిన్‌, దయానందనగర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Updated Date - Mar 16 , 2025 | 01:19 AM