Share News

జ్వరపీడితులకు సత్వర వైద్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:18 AM

ఆరోగ్య సమస్యలు తలెత్తితే నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా గిరిజనులకు సూచించారు. వైద్యులను, వైద్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలని సూచిఇంచారు. మండలంలోని బాబుసాల పంచాయతీ బల్లుగూడలో గత పది రోజుల్లో ముగ్గురు చిన్నారులు జ్వరంబారిన పడి మృతిచెందారు.

జ్వరపీడితులకు సత్వర వైద్యం
చిన్నారికి మందు పట్టిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ జామాల్‌ బాషా

ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి

డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

బల్లుగూడలో ప్రత్యేక వైద్య శిబిరం సందర్శన

ముంచంగిపుట్టు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలు తలెత్తితే నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా గిరిజనులకు సూచించారు. వైద్యులను, వైద్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలని సూచిఇంచారు. మండలంలోని బాబుసాల పంచాయతీ బల్లుగూడలో గత పది రోజుల్లో ముగ్గురు చిన్నారులు జ్వరంబారిన పడి మృతిచెందారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. శనివారం రూడకోట పీహెచ్‌సీ వైద్యాధికారులు కిశోర్‌, సత్యారావు ఆధ్వర్యంలో బల్లుగూడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా ఈ గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్వరపీడితులు, వ్యాధి గ్రస్థులకు సత్వర వైద్య సేవలు అందేవిధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 49 మందికి వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. వీరిలో జ్వరంతో బాధపడుతున్న 25 మంది చిన్నారులకు రక్తపరీక్షలు నిర్వహించగా సాధారణ జ్వరాలుగా తేలిందన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఏడుగురు చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులతో మాట్లాడి పిల్లల మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చిన్నారుల మృతికి గల కారణాలను తెలుసుకోనేందుకు పరీక్షలు జరుగుతున్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణులు కిరణ్‌, బాలాజీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:18 AM