విమానాశ్రయంపై చిన్నచూపు
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:13 AM
ఒకప్పుడు దివ్యంగా వెలుగొందిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు వెలవెలబోతోంది.

తగ్గిపోతున్న విమాన సర్వీసులు
ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిచిపోయిన విజయవాడ ఫ్లైట్స్
నెలాఖరు నుంచి బ్యాంకాక్, మలేషియా సర్వీస్‌లకు బుకింగ్స్ బంద్
కార్గో సర్వీసులకు దిక్కు లేని పరిస్థితి
ఉడాన్ క్యాంటీన్‌కు కూడా నోచుకోని వైనం
కేంద్ర మంత్రి చొరవ తీసుకోవాలని నగరవాసుల విన్నపం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు దివ్యంగా వెలుగొందిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు వెలవెలబోతోంది. భోగాపురంలో ఇంకా కొత్త విమానాశ్రయం నిర్మించకముందే దీనిని నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు కారణాలు లేకుండా రద్దు అయిపోతున్నాయి. ఎక్కడైనా ఆక్యుపెన్సీ లేకపోతే విమానాలు రద్దు చేస్తారు. కానీ విశాఖలో ఆ సమస్య లేదు. అన్ని విమానాలు 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అయినా పలు సర్వీస్‌లు రద్దు చేస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లడానికి రోజూ ఉదయం రెండు సర్వీసులు ఉండేవి. వాటిని ఈ నెల ఒకటి నుంచి ఆపేశారు. దీనివల్ల వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాగే ఈ నెలాఖరు నుంచి అంతర్జాతీయ సర్వీసులు బ్యాంకాక్, మలేషియాలకు బుకింగ్స్ ఆపేశాయి. ఇక మిగిలింది సింగపూర్ విమానం ఒక్కటే. రాష్ట్రంలో విదేశీయులు ఎక్కువ మంది వచ్చే నగరం తిరుపతి. ఆ తరువాత విశాఖపట్నమే. అలాంటి నగరానికి అంతర్జాతీయ సర్వీసులు రద్దయిపోతున్నాయి. గతంలో ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ విమాన సంస్థలతో చర్చించి గోవా, భువనేశ్వర్, కోయంబత్తూర్, పుణే నగరాలకు విమాన సర్వీసులు వేయించింది. అవన్నీ నిలిచిపోయాయి. ఆకాశ్ ఎయిర్ ముంబై సర్వీస్ నిలిపివేసింది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టిటివీ అవసరం. ఈ విషయంలో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవ తీసుకోవలసి ఉంది. కొత్త విమాన సర్వీసులు తెప్పించాల్సి ఉంది.
ఉడాన్ యాత్రీ కేఫ్‌ల అవసరం
కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని గుర్తించి, వాటి కారణంగా ప్రయాణికులు ఆకలితో ఉండకూడదని ఇటీవల ‘ఉడాన్ యాత్రీ కేఫ్’లు ప్రారంభించింది. విమానాశ్రయంలో వీటిని ఏర్పాటు చేసి టీ, కాఫీ, టిఫిన్ ఏదైనా 20 రూపాయలకే ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఇటువంటి క్యాంటీన్‌ను ఇటీవలె చెన్నై విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విశాఖ విమానాశ్రయంలో రెండు ఇడ్లీ రూ.180కి విక్రయిస్తున్నారు. టీ లేదా కాఫీ తాగితే రూ.100 చెల్లించాలి. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున నాలుగు వేల మంది ప్రయాణిస్తున్నారు. ఇక్కడ కూడా ఆ క్యాంటీన్ అవసరం ఉంది. కానీ మంత్రి ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
ఆర్థిక శాఖ మంత్రి చెప్పినా చర్యలు లేవు
విమానాశ్రయాల నుంచి సరకు రవాణా పెంచాలని, వాటిని ప్రోత్సహిస్తామని కొత్త బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల ఆమె విశాఖ వచ్చినప్పుడు అపాటా ప్రతినిధులు విశాఖలో మల్టీ టెంపరేచర్ కోల్ట్ స్టోరీజీ సౌకర్యంతో కార్గో గోడౌన్ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి ఆమె స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ పంపితే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దానిని కూడా కేంద్ర మంత్రి పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూడా విశాఖ విమానాశ్రయంపై దృష్టిసారించాల్సి ఉంది.
కేంద్ర మంత్రితోనే సాధ్యం
విశాఖపట్నం విమానాశ్రయం సమస్యలు పరిష్కరించే సత్తా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు మాత్రమే ఉందని అపాటా ప్రతినిధులు నరేశ్‌కుమార్, కుమార్ రాజా, డీఎస్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఆయనకు ఓ లేఖ రాశారు. రద్దయిన సర్వీసులు పునరుద్ధరించాలని కోరారు.