Share News

గ్రేటర్‌లో కాంట్రాక్టర్‌ హవా

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:14 AM

జీవీఎంసీలోని భూగర్భ డ్రైనేజీ (యూజీడీ), నీటి సరఫరా విభాగంలో ఒక కాంట్రాక్టర్‌ చక్రం తిప్పుతున్నారు.

గ్రేటర్‌లో కాంట్రాక్టర్‌ హవా

  • యూజీడీ టెండర్లలో చక్రం తిప్పుతున్న వైనం

  • రూ.20 కోట్ల విలువైన పనులకు బిడ్లు పిలిచేందుకు సిద్ధమైన అధికారులు

  • ఒక్కొక్కరికీ మూడింటికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈఈకి సదరు కాంట్రాక్టర్‌ ఆదేశం

  • ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపిన ఇంజనీర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలోని భూగర్భ డ్రైనేజీ (యూజీడీ), నీటి సరఫరా విభాగంలో ఒక కాంట్రాక్టర్‌ చక్రం తిప్పుతున్నారు. విభాగంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వంటి ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఆ కాంట్రాక్టరే అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఆ విభాగంలో సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధం కాగా, ఒక్కో కాంట్రాక్టర్‌కు మూడేసి వర్కులు చొప్పున పంచేయాలని సూచించారు. అధికారులు కూడా సదరు కాంట్రాక్టర్‌ చెప్పినట్టుగానే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినట్టు ప్రచారం జరుగుతోంది.

నగరంలో నీటి సరఫరా, యూజీడీ నిర్వహణకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు ఆ విభాగాల బాధ్యతలు చూస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయి అధికారి అంచనాలు తయారుచేశారు. నీటి సరఫరా, యూజీడీ విభాగాల్లో పనులకు జీవీఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లలో 15 నుంచి 20 మంది మాత్రమే టెండర్లు వేస్తుంటారు. వారిలో యూనియన్‌ పేరుతో ఇటీవలకాలంలో హడావుడి చేస్తున్న ఒక కాంట్రాక్టర్‌ ఆ విభాగంలోని అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు వసూలు చేయడంతోపాటు సందర్భాన్ని బట్టి అధికారులకు పార్టీలు ఇవ్వడం, పిక్నిక్‌ల పేరుతో ట్రీట్‌లు ఇవ్వడం చేస్తుండడంతో అధికారులు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. త్వరలో రూ.20 కోట్లు విలువైన 75కి పైగా పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమైనట్టు సదరు కాంట్రాక్టర్‌ తెలిసింది. ఒక్కోపనికి విడివిడిగా కాంట్రాక్లర్లు అందరూ టెండర్లు వేస్తుండడంతో భారీ లెస్‌లకు వెళ్లిపోతున్నాయని, అలాకాకుండా ఒక కాంట్రాక్టర్‌కు మూడేసి వర్కులు చొప్పున పంచి పెట్టేయాలని ఇంజనీరింగ్‌ అధికారికి సూచించారు. ఎవరికి వారు టెండర్‌ వేసేయకుండా, ఒక్కొక్కరు మూడు వర్కులకు మాత్రమే టెండర్‌ వేసేలా తాను చూసుకుంటానన్నారు. దీనివల్ల అందరికీ వర్కులు దొరకడంతోపాటు గరిష్ఠంగా ఐదు, పది శాతానికి మించి లెస్‌లకు వెళ్లే అవకాశం ఉండదని, కాంట్రాక్టర్లకు కూడా భారీగా డబ్బులు మిగులుతాయని అధికారులకు వివరించారు. కాంట్రాక్టర్లపై పట్టు కలిగిన వ్యక్తికావడంతోపాటు తమకు కూడా అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో సంబంధిత అధికారి సరేనని తలూపారు. కాంట్రాక్టర్లందరికీ న్యాయం జరిగేలా ఒక్కో కాంట్రాక్టర్‌ గరిష్ఠంగా మూడు వర్కులు మాత్రమే చేయాలని, అంతకుమించి వర్కులు దక్కినా సరే వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేది లేదని షరతు పెడుతూ ప్రతిపాదనలను తయారుచేసి చీఫ్‌ ఇంజనీర్‌ ఆమోదానికి పంపించారు. దానిని పరిశీలించి చీఫ్‌ ఇంజనీర్‌ వివాదానికి దారితీస్తుందనే ఉద్దేశంతో పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. ఈ వ్యవహారం జీవీఎంసీలో తెలిసిపోవడంతో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఒక కాంట్రాక్టర్‌ చెప్పినట్టు అధికారులు చేయడం ఆశ్చర్యంగా ఉందని, కాంట్రాక్టర్ల మధ్య పోటీ తగ్గిపోతే తక్కువ లెస్‌లకు వర్కులు వెళ్లిపోవడం వల్ల నగర పాలక సంస్థకు నష్టం జరుగుతుందని అంటున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:14 AM