Share News

మాస్టర్‌ ప్లాన్‌ రహదారులపై అనుమానాలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:29 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా చేపట్టబోతున్న 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయ్యేలోగా వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యం. అయితే అసలు విమానాశ్రయానికి, ఈ రహదారులకు సంబంధం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. వీటికి సుమారు రూ.400 కోట్లు అవసరమని అంచనా వేశారు. అన్ని నిధులు వీఎంఆర్‌డీఏ వద్ద లేవు. అయినా ఆగమేఘాలపై పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ రహదారులపై  అనుమానాలు
వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు

ఆగమేఘాలపై రూ.400 కోట్లతో నిర్మాణం

ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యం

భూములు కోల్పోయేది ఎందరు...

వారికి పరిహారం ఎలా?

భోగాపురం విమానాశ్రయానికి వేగంగా చేరుకోవాలంటే నగరంలో ఫ్లైఓవర్లు నిర్మించాలి

ఆ విషయం పక్కనపెట్టి మాస్టర్‌ప్లాన్‌ రహదారులు చేపట్టడంపై విమర్శలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా చేపట్టబోతున్న 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయ్యేలోగా వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యం. అయితే అసలు విమానాశ్రయానికి, ఈ రహదారులకు సంబంధం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. వీటికి సుమారు రూ.400 కోట్లు అవసరమని అంచనా వేశారు. అన్ని నిధులు వీఎంఆర్‌డీఏ వద్ద లేవు. అయినా ఆగమేఘాలపై పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

భోగాపురం విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలంటే విశాఖ నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, కొమ్మాది వంటి ప్రధాన జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించడానికి మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపాదించిన రహదారులలో అడవివరం, శొంఠ్యాం మీదుగా అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిని కలిపే మార్గం ఒక్కటే భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇక వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన రహదారులన్నీ దాదాపుగా భీమిలి నియోజకకవర్గంలోనే ఉన్నాయి. ఆనందపురం, భీమిలి మండలాల్లో అనేక లేఅవుట్లను కలుపుతూ ఈ మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు ఉన్నాయి. వీటి నిర్మాణం వల్ల భోగాపురం వైపు ట్రాఫిక్‌ ఒత్తిడి ఎలా తగ్గుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. గంభీరంలో మాస్టర్‌ ప్లాన్‌ రహదారి ప్రతిపాదించారు. దానిని కూడా భోగాపురం విమానాశ్రయానికి లింక్‌ పెట్టారు. విశాఖ హైవేపై వెళ్లే వారు గంభీరం లోపలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు చెప్పి ఈ మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను ఆగమేఘాలపై పూర్తి చేయడానికి యత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రూ.400 కోట్ల నిధులు ఎక్కడ?

ప్రతిపాదించిన 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.400 కోట్లు అవసరమని వీఎంఆర్‌డీఏ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద అన్ని నిధులు లేవు. గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 80 శాతం నిధులు జగనన్న ఒక సెంటు ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధికి వాడేసుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చింది. వాటిని వేలం వేసి అమ్ముకోవాలని సలహా ఇచ్చింది. వీఎంఆర్‌డీఏ ప్రస్తుతం అదే పనిలో ఉంది. పాత లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లను వేలానికి పెట్టింది. ఇప్పుడు విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంత పెద్దగా లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీఎంఆర్‌డీఏ వద్ద 300 గజాల ప్లాటు కొంటే కనీసం రూ.40 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. ఇంటి స్థలానికి అంత వెచ్చించినా వెంటనే ఇల్లు కట్టుకునే పరిస్థితి ఆ లేఅవుట్లలో లేదు. భూమిపై పెట్టుబడి పెట్టే వారికే అవి ఉపయోగపడతాయి.

భూములు కోల్పోయే వారి పరిస్థితి?

ఈ 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి సుమారు 75 ఎకరాలు ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీసుకోవలసి ఉంటుంది. వారు ఎవరో ఇప్పటివరకూ గుర్తించలేదు. వారికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. భూమికి భూమి ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి ప్రభుత్వ ఆమోదం ఉండాలి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం టీడీఆర్‌లు ఇవ్వాలనేది అధికారుల ఆలోచన. కానీ వాటిని కూడా ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఇవ్వడం లేదు. సింహాచలంలో బీఆర్‌టీఎస్‌ రహదారికి సంబంధించి ఇదే విషయమై వివాదం నడిచింది. ఇవేవీ పట్టించుకోకుండా రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 03 , 2025 | 01:29 AM