Share News

పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:11 AM

జీవో 117 రద్దు నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై విద్యా శాఖ తర్జనభర్జన పడుతోంది.

పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు

  • జీవో 117 రద్దు అనంతరం ఐదు రకాల పాఠశాలల నిర్వహణకు ప్రతిపాదన

  • ప్రతి పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల

  • పిల్లల రవాణా వ్యయం భరించనున్న ప్రభుత్వం

  • పది మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు ఎత్తివేత?

  • తల్లిదండ్రుల కమిటీల నుంచి వ్యతిరేకత

  • తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్‌కు అప్పగింత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవో 117 రద్దు నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై విద్యా శాఖ తర్జనభర్జన పడుతోంది. వైసీపీ పాలనలో ప్రాథమిక విద్య వెన్ను విరిచిన జీవో 117ను రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత స్థాయిలో రూపొందించిన విధానాల ప్రకారం ఐదు రకాల బడులను తెరపైకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న 3,4,5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకువస్తున్నారు. అలాగే ప్రతి పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటుచేస్తారు. ఆ ఆదర్శ పాఠశాలకు మిగిలిన గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధానంలో ఆదర్శ పాఠశాల విషయంలో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

నూతన విధానంలో పది మంది పిల్లల కంటే తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల కొనసాగింపుపై విద్యా శాఖ గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి ప్రాథమిక పాఠశాలలు మూతపడడం అనివార్యంలా కనిపిస్తోంది. అక్కడ అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ) మాత్రమే బోధిస్తారని టీచర్లు చెబుతున్నారు. పది మంది కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలను సమీప గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తరలిస్తారు. జీవో 117 రద్దుతో కొత్తగా తెరపైకి వచ్చిన విధానం ప్రకారం ఐదు రకాల బడుల విధానం అమలుచేస్తారు. దీని ప్రకారం శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు, శాటిలైట్‌ పాఠశాలలు, బేసిక్‌ పాఠశాల, ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై జిల్లాలో 586 పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల మనుగడపై సందేహం ఉన్నచోట వ్యతిరేకించారు. ఆనందపురం, పద్మనాభం, పెదగంట్యాడ, పెందుర్తి మండలాల్లో తక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు తమ సమ్మతి చెప్పలేదు. ఆయా గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి తల్లిదండ్రులను నచ్చజెప్పాలని సూచించింది. పిల్లల సంఖ్య మరీ తక్కువగా ఉంటే అక్కడ ఉన్న ఒకటి, రెండు తరగతులను సమీపంలోని పాఠశాలలకు పంపుతారని అటువంటప్పుడు గ్రామంలో శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూలు ఉంటుందని చెప్పాలని సూచించింది.

జీవో 117 అమలుతో ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. దీంతో కొన్నిచోట్ల పాఠశాలలు మూతపడ్డాయి. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను మరోసారి చేస్తే గ్రామాల్లో ప్రాథమిక విద్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగే పాత విఽధానం అమలు చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో శివారు ప్రాంతాల్లో పిల్లలు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు ఇవే...

పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం శాటిలైట్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు అమలులోకి వస్తాయి.

1. శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు. వీటిలో పూర్వ ప్రాథమిక విద్య (పీపీ-1, 2... (ఎల్‌కేజీ, యూకేజీ( బోధిస్తున్నారు. అదే జరిగితే ఆయా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకం. కేవలం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించి అనంతరం ఆయా గ్రామాల్లో పిల్లలను సమీపంలో పాఠశాలలకు పంపుతారు.

2. ఫౌండేషన్‌ పాఠశాలలు: పీపీ-1, పీపీ-2, ఒకటి, రెండో తరగతి వరకు మాత్రమే బోధన చేస్తారు. అటువంటి గ్రామాల్లో 3,4,5 తరగతుల విద్యార్థులు సమీపంలో ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది.

3. బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలు: పీపీ-1,2తో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. అంటే 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఇస్తారు.

4. ఆదర్శ పాఠశాలలు: ప్రతి పంచాయతీలో 60 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేస్తారు. పీపీ-1, 2, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధన చేస్తారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలలకు పంపిన 3,4,5 తరగతులను వెనక్కి తీసుకువచ్చి ఆదర్శ పాఠశాలలో చేర్చుతారు.

5. ఉన్నత పాఠశాలలు: గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతలు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. కొత్త విధానంలో ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు మాత్రమే ఉంటాయి. ప్రాథమికోన్నత పాఠశాలలకు వస్తే 30 మంది కంటే తక్కువగా ఉన్నవాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చుతారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా, 60 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న యూపీ పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు.

Updated Date - Mar 16 , 2025 | 01:11 AM