100 ఎకరాలకు స్కెచ్
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:04 AM
ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం సర్వే నంబర్-1లో రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కొట్టేయడానికి నగరానికి చెందిన ఓ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

భీమన్నదొరపాలెం భూములపై పెద్దల కన్ను
కొన్ని డి.పట్టాభూములు
మరికొన్ని రైతుల ఆక్రమణలో ఉన్నవి...
ఆక్రమణలో ఉన్నా రికార్డుల్లో నమోదుకానివి ఇంకొన్ని
మొత్తం చేజిక్కించుకునేందుకు ఓ గ్యాంగ్ యత్నం
ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని బేరాలు
తరువాత ప్రభుత్వ అవసరాలకు అప్పగించి భారీగా లబ్ధి పొందే కుట్ర
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం సర్వే నంబర్-1లో రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కొట్టేయడానికి నగరానికి చెందిన ఓ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ గ్యాంగ్‌కు మండలంలో కొందరు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు మాయమాటలు చెప్పి ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లక్షల చొప్పున ముట్టజెప్పి మొత్తం భూములు కొట్టేయాలని స్కెచ్ వేశారనే ప్రచారం సాగుతోంది.
భీమన్నదొరపాలెంలో సర్వే నంబర్-1లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఏళ్ల క్రితం గ్రామంలోని రైతులు వీటిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. వీరిలో కొందరికి అప్పట్లో ప్రభుత్వం డి-పట్టాలు ఇచ్చింది. మిగిలిన వారిలో కొందరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో (4-సీ) ఆక్రమణదారులుగా నమోదయ్యాయి. మరికొంత భూమి పలువురు రైతుల ఆధీనంలో ఉన్నప్పటికీ వారికి డీపట్టాలు ఇవ్వలేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఆక్రమణదారులుగా నమోదుకాలేదు. రెవెన్యూ పరిభాషలో ఇటువంటి భూములను నాన్ 4-సీగా పిలుస్తారు. అంటే హక్కులు లేకున్నా భూములు సదరు రైతుల ఆధీనంలో ఉన్నట్టు. మొత్తం మూడు కేటగిరీలుగా ఉన్న భూములను అధికారికంగా క్రయవిక్రయాలు చేపట్టేందుకు అవకాశం లేదు.
రంగంలోకి గ్యాంగ్
జాతీయ రహదారికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములపై పెద్దల కన్ను పడింది. ఒకేచోట 100 ఎకరాలు ఉండడంతో కొందరు ముఠాగా ఏర్పడి కొద్దిరోజులుగా రైతులతో మంతనాలు సాగిస్తున్నారు. డీపట్టాలు ఇప్పిస్తామని, తమకే విక్రయించాలని స్థానిక అధికార పార్టీ నేతల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని బేరాలు సాగిస్తున్నారు. ఈ భూములు మొత్తం కొనుగోలు చేసిన తరువాత అధికార పార్టీలో కీలక నేతల ద్వారా పైరవీ చేసుకుని క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల ఈ ముఠా గ్రామానికి తరచూ వెళ్లి రైతులతో చర్చలు జరుపుతోంది.
4-సీ క్రమబద్ధీకరణ ఎలా?
గతంలో డీపట్టా భూములను వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేయడం పెద్ద వివాదమైంది. దీనిపై చేపట్టిన విచారణ కొలిక్కిరాలేదు. ఈ సమయంలో డీపట్టా లేకుండా కేవలం ప్రభుత్వ రికార్డులలో ఆక్రమణదారులుగా గుర్తించిన (4-సీ) భూములను క్రమబద్ధీకరణ చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కారుచౌకగా భూములు చేజిక్కించుకుని తరువాత వీఎంఆర్‌డీఏ లేదా ప్రభుత్వ అవసరాలకు ఇస్తే భారీగా లబ్ధి పొందవచ్చుననే ఉద్దేశంతో నగరానికి చెందిన గ్యాంగ్ ఈ భూములపై కన్నేసిందనే వాదన వినిపిస్తోంది.