Share News

CRPF Forces Confusion: వెనక్కి వచ్చేయండి

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:45 AM

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మధ్య గందరగోళం ఏర్పడింది. తెలంగాణ మరియు ఏపీ వైపు పహారా కాస్తున్న బలగాలకు వెనక్కి రావాలని ఆదేశాలు అందినా తిరిగి వెళ్లేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు

CRPF Forces Confusion: వెనక్కి వచ్చేయండి

  • నాగార్జున సాగర్‌పై పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి పిలుపు

  • ములుగు బెటాలియన్‌ నుంచి ఆదేశాలు

  • బెటాలియన్‌కు వెళ్లేందుకు సిబ్బంది సిద్ధం

  • రెండ్రోజుల క్రితం ఏపీ వైపు బలగాలకూ పిలుపు.. వెంటనే ఆ నిర్ణయం ఉపసంహరణ

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ డ్యామ్‌ భద్రతపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. సాగర్‌ ప్రధాన డ్యామ్‌ వద్ద పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు విధులు నిర్వర్తించే విషయంలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. డ్యామ్‌లో తెలంగాణ వైపున విధులు నిర్వర్తిస్తోన్న ములుగుకు చెందిన 39వ బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని వెనక్కి రమ్మని ఆదివారం ఆదేశాలు అందాయి. ఏపీ వైపు పహారాలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి కూడా రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఆదేశాలు వచ్చాయి. తాజా ఆదేశాల నేపథ్యంలో బెటాలియన్‌కు తిరిగి వెళ్లేందుకు తెలంగాణ వైపున ఉన్న బలగాలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం సిబ్బంది అంతా విధుల్లో కొనసాగుతున్నా.. బెటాలియన్‌ నుంచి వాహనాలు రాగానే వారు బయలుదేరతారు. ఈ విషయంపై సాగర్‌ డ్యామ్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జున్‌రావును వివరణ కోర గా.. ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనని, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు టీజీ ఎస్పీఎఫ్‌ సిబ్బందిని సిద్ధం చేస్తున్నారని చెప్పారు.


గత ఏడాది డిసెంబరు 28న కూడా వెనక్కి రావాలని తెలంగాణ వైపున ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి ఇలానే ఆదేశాలు రాగా వారు నల్లగొండ దాకా వెళ్లారని, విధుల్లోనే కొనసాగాలని సాయంత్రం మళ్లీ ఆదేశాలు రావడంతో రాత్రికి తిరిగి సాగర్‌కు చేరుకున్న విషయాన్ని మల్లికార్జున్‌రావు గుర్తుచేశారు. కాగా, రెండ్రోజుల క్రితం ప్రధాన డ్యామ్‌కు కుడి వైపున ఏపీ పరిధిలో పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు కూడా వెనక్కి రావాలని ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 234వ బెటాలియన్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో డ్యామ్‌ భద్రతకు ఎంత మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది కావాలో చెప్పాలని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు.. డ్యామ్‌ అధికారులతో మాట్లాడారు. ఈ లోగా వెనక్కి రావొద్దు, అక్కడే ఉండండి అంటూ బెటాలియన్‌ నుంచి ఆదేశాలు రావడంతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 03:45 AM