రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:16 AM
పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి నిమ్మక ప్రేమ్‌కుమార్ తెలిపారు.

జిల్లాలో 134 కేంద్రాలు
29,927 మంది విద్యార్థులు
రెగ్యులర్ 28,523 మంది
ఆరు కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పరీక్ష ప్రారంభమైన అరగంట వరకూ పరీక్షా హాలులోకి అనుమతి
...అయితే ప్రతిరోజూ ఆలస్యంగా వెళితే మాత్రం ప్రవేశం ఉండదు
ఎలక్ర్టానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు నిషేధం
15 కేంద్రాల్లో ఓపెన్ స్కూలు పరీక్షలకు 938 మంది
విశాఖ సెంట్రల్ జైలులో 30 మంది ఖైదీలకు కేంద్రం ఏర్పాటు
జిల్లా విద్యాశాఖాధికారి నిమ్మక ప్రేమ్‌కుమార్
విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి నిమ్మక ప్రేమ్‌కుమార్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ/ఏప్రిల్ ఒకటో తేదీ (రంజాన్ 31వ తేదీన జరిగితే) వరకూ జరిగే పరీక్షలకు 29,927 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. వీరిలో 28,523 మంది రెగ్యులర్, 1,404 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారన్నారు. రెగ్యులర్ విద్యార్థులలో బాలురు 15,094 మంది, బాలికలు 13,429 మంది ఉన్నారన్నారు. ఒకేషనల్ ట్రేడ్‌లో 2,124 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పరీక్షలకు జిల్లాలో మొత్తం 134 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.
ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని మాస్ కాపీయింగ్‌ను నిరోధించడానికి శొంఠ్యాం, గంగవరం, ఇస్లాంపేట, నరవ, అగనంపూడి, రెడ్డిపల్లి కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను నియమించామన్నారు. 1,472 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని డీఈవో తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైతే అరగంట వరకు విద్యార్థులను అనుమతిస్తామని, అయితే ప్రతిరోజు ఆలస్యమైతే మాత్రం ప్రవేశం ఉండదని స్పష్టంచేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. హాల్ టికెట్ చూపి విద్యార్థులు కేంద్రాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చునని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ర్టానిక్ వస్తువులు, ఫోన్లు తీసుకురావద్దని స్పష్టంచేశారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదన్నారు. దివ్యాంగులు, మానసిక దివ్యాంగులు, అంధులు, ప్రమాదవశాత్తూ గాయాలకు గురైన విద్యార్థులు 265 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరందరికీ తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులను స్రైబ్‌గా అనుమతిస్తున్నామని చెప్పారు.
ఈనెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 15 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపెన్‌స్కూలు పరీక్షలు జరుగుతాయని డీఈవో వెల్లడించారు. ఈ పరీక్షలకు 938 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వీరిలో విశాఖ సెంట్రల్ జైలులో గల 30 మందికి ఒక కేంద్రం ఏర్పాటుచేశామన్నారు. బయట నుంచి టీచర్లను ఇన్విజిలేటర్లగా నియమించామని ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ మురళీమోహన్ పాల్గొన్నారు.