టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:21 AM
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా శాఖ రంగం సిద్ధం చేస్తోంది.

నెలాఖరులో హెచ్‌ఎంల బదిలీలు
వచ్చే నెలలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు
అనంతరం బదిలీలు
ఉమ్మడి జిల్లాలో 1,000 నుంచి 1,200 మందికి స్థానచలనం
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా శాఖ రంగం సిద్ధం చేస్తోంది. పదోన్నతులకు ఇప్పటికే సీనియారిటీ జాబితా రూపొందించిన విద్యా శాఖ వాటిపై పలు దఫాలుగా అభ్యంతరాలు స్వీకరించింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాపరంగా తయారుచేసిన సీనియారిటీ జాబితాపై ఇంకా పలు ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జడ్పీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎం పదోన్నతుల కోసం రూపొందించిన జాబితాలపై, ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంల పదోన్నతుల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈనెల 19వ తేదీ గడువిచ్చారు. అభ్యంతరాలు స్వీకరించిన తరువాత వాటిని పరిష్కరించనున్నారు. ఈ నెలాఖరున ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఎం లకు బదిలీలు ఉంటాయి. ఆ తరువాత వచ్చే నెలలో పోస్టుల ఖాళీల (సుమారు 30 వరకూ ఉన్నాయి) మేరకు స్కూల్ అసిస్టెంట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. ఆ తరువాత స్కూలు అసిస్టెంట్ టీచర్ల బదిలీలు చేపడతారు. అనంతరం సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి, వారికి బదిలీలు చేపడతారు. కాగా ఈ పర్యాయం భారీగా స్థాన చలనం కలగనున్నదంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో భారీగా బదిలీలు జరిగాయి. అప్పట్లో బదిలీలు జరిగిన స్కూల్ అసిస్టెంట్, సెకండరీగ్రేడ్ టీచర్లంతా ఒకేచోట ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్నారు. అందువల్ల విధిగా వీరికి ఆయా చోట్ల నుంచి స్థాన చలనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో 1,000 నుంచి 1,200 మంది టీచర్లకు బదిలీలు జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి.
వెబ్‌సైట్‌లో హెచ్ ఎంల పదోన్నతుల సీనియారిటీ జాబితా
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జోన్ పరిధిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్ పోస్టు నుంచి గెజిటెడ్ గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను ‘ఆర్‌జేడీఎస్‌ఈవీఎస్‌వీ.కామ్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పాఠశాల విద్యాశాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకుడు బి.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాలని కోరారు. అన్ని ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.