Share News

విధేయతకు పట్టం

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:47 AM

పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మండలంలోని దేవవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవర సత్యనారాయణ నియమితులయ్యారు.

విధేయతకు పట్టం

ఫొటోః4ఎన్‌కేపీ4: దేవర సత్యనారాయణ

టీడీపీ సీనియర్‌ నేత ‘దేవర’కు పదవి

‘పేట ఏంఎంసీ చైర్మన్‌గా నియామకం

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగిన నేతగా గుర్తింపు

నక్కపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మండలంలోని దేవవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవర సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే వుంటూ అధిష్ఠానానికి విధేయుడుగా వుంటున్న ఆయనకు చాలా కాలం తరువాత నామినేటెడ్‌ పదవి లభించింది. మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత 1987లో ఎంపీపీ పదవికి తొలిసారి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన నక్కపల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. తరువాత తరువాత 2013లో దేవవరం పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. పార్టీ పరంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి నిబద్ధత గల నేతగా గుర్తింపు పొందారు.

కామర్స్‌లో మాస్టర్స్‌ చేసిన సత్యనారాయణ జిల్లా గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం చైర్మన్‌గా సుమారు రెండు దశాబ్దాలపాటు సేవలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన వంగలపూడి అనిత సిఫారసుతో యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, పలువురు నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నెరవేరుస్తానని సత్యనారాయణ చెప్పారు.

Updated Date - Apr 05 , 2025 | 12:47 AM