Hard times for Aqua ఆక్వాకు కష్టకాలం
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:58 PM
Hard times for Aqua వైసీపీ పాలనలో ఆక్వా పరిశ్రమకు విద్యుత్ రాయితీ లేదు. ఇతర ప్రోత్సాహకాలు అసలే లేవు. రొయ్యల చెరువుల సాగును నిలిపేసిన పరిస్థితి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీతోపాటు ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో చెరువుల సాగుకు పలువురు సిద్ధమయ్యారు.

ఆక్వాకు కష్టకాలం
జిల్లాలో రొయ్య పరిశ్రమకు అమెరికా సుంకాల సెగ
4 శాతం ఉన్న పన్ను 26 శాతానికి పెంపు
ఆందోళనలో హేచరీల నిర్వాహకులు, మత్స్యకారులు
వైసీపీ పాలనలో ఆక్వా పరిశ్రమకు విద్యుత్ రాయితీ లేదు. ఇతర ప్రోత్సాహకాలు అసలే లేవు. రొయ్యల చెరువుల సాగును నిలిపేసిన పరిస్థితి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీతోపాటు ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో చెరువుల సాగుకు పలువురు సిద్ధమయ్యారు. ఇంతలోనే అమెరికాలో పన్నుల మోత నిర్ణయం వెలువడింది. రొయ్య ధర తగ్గుముఖం పట్టింది. దీంతో చెరువుల సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఇటు హేచరీల పరిస్థితి కూడా అంతే. భోగాపురం అధికంగా హేచరీలే ఉన్నాయి. నిర్వాహకులంతా ఆందోళన చెందుతున్నారు.
భోగాపురం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి):
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది జిల్లాలో ఆక్వా పరిస్థితి. వైసీపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. విద్యుత్ చార్జీలు, ఇతరత్రా పన్నుల భారంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొందరు ఆక్వా రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రాయితీలు, ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహంలో భాగంగా ఊతమిచ్చే చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఇంతలోనే అగ్రరాజ్యం అమెరికాలో ప్రతీకార సుంకాలు మొదలయ్యాయి. దీంతో మన జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై కూడా పన్ను భారం పెరిగింది. దీనికి రవాణా, ఇతరత్రా చార్జీలు అదనం కానున్నాయి. జిల్లాలో రెండు తీరప్రాంత మండలాలుండగా అధికంగా హేచరీలు ఉన్నాయి. భోగాపురం మండలంలో తొమ్మిది హేచరీలు పనిచేస్తున్నాయి. చెరువులు తక్కువ. ఇటు పూసపాటిరేగ మండలంలోనూ చెరువులు అంతంతమాత్రమే. గత ప్రభుత్వ విధానాలతోనే కొత్తవారు రొయ్యల చెరువుల నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు. హేచరీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు రొయ్య పిల్లలు ఎగుమతి అవుతుంటాయి. ఏడాదికి రూ.కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఎక్కువగా అమెరికాకు ఎగుమతయ్యే రొయ్య ఇక్కడ సాగవుతోంది. ఇక్కడ నుంచి రొయ్యలను వ్యాపారులు సేకరించి విశాఖ పోర్టు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇప్పటివరకూ అమెరికాలో రొయ్యలపై 3 నుంచి 4 శాతం సుంకం మాత్రమే విధించేవారు. ఆ పన్నును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 26 శాతానికి పెంచేస్తున్నారు. ఆ ప్రభావంతో జిల్లా రైతులు ధర తగ్గించుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామంపై ఆక్వా నిర్వాహకులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పన్నులకే సగం..
కొత్త సుంకాలు అమల్లోకి వస్తే రూ.లక్ష విలువ చేసే రొయ్యలు అమెరికాకు ఎగుమతి చేయాలంటే రూ.26వేలు పన్ను కట్టాల్సి ఉంటుంది. రవాణా, ప్యాకింగ్, ఇతరత్రా ఖర్చులతో కలిపి 50శాతం ధర పెరగడం ఖాయం. అందుకే రైతుల నుంచి సేకరించి అమెరికాకు రొయ్యలు తరలిస్తున్న వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. రొయ్యల ధర తగ్గిస్తున్నారు. చేసిందేమీ లేక రైతులు కూడా తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ఇలా అయితే నిర్వహణ కష్టమేనని ఆక్వా రైతులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట వరకూ 100 కౌంట్ ధర రూ.230 ఉంది. తాజా పరిణామాలతో ఉన్నఫలంగా రూ.40 తగ్గించారు. ఈ ధర మరింత తగ్గనుందని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
వైసీపీ పాలనలో కుదేలు..
వైసీపీ పాలనలో ఆక్వారంగానికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. పెరిగిన మేతలు, మందుల ధరలు, లీజు వ్యవహారాలతో ఆక్వారంగం మరింత నీరసించిపోయింది. ఆక్వా జోన్ల సమస్య, విద్యుత్ ధరలతో ఏకంగా కుదేలైంది. జగన్ రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేకపోయారు. ఈ-షిప్ విధానంలో అనేక నిబంధనలను తెరపైకి తెచ్చారు. టీడీపీ హయాంలో వంద రొయ్యల ధర రూ.250 నుంచి రూ.260 వరకూ ఉండేది. కానీ వైసీపీ హయాంలో రూ.180కు పడిపోయింది. ఉప్పు, మంచినీరు ఆక్వా జోన్లుగా విభజించారు. పది ఎకరాల్లోపు సాగుచేసిన రైతులకు మాత్రమే రూ.1.50కు యూనిట్ విద్యుత్‌ను అందించారు. దీంతో జిల్లాలోని ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందలేదు.
ప్రభుత్వాలు రాయితీ కల్పించాలి
దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఆక్వా రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీ నిలిపేసింది. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రాయితీ కల్పిస్తుందని అనుకుంటున్న సమయంలో అమెరికా విధించిన ఆంక్షలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. రొయ్యలు ఉత్పత్తి చేసేబదులు వేరే పని చూసుకోవడం మేలు అనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీ కల్పించి ఆదుకోవాలి.
మదు, రొయ్యల ఆక్వా రైతు, రామచంద్రపేట, భోగాపురం మండలం.
ఇతర దేశాలకు ఎగుమతులు పెరగాలి
అమెరికా దిగుమతి సుంకం పెంచుకుపోతున్న పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. మన దేశంలో డొమస్టిక్ మార్కెట్ పెరగాలి. కేవలం విదేశీ మార్కెట్‌పై ఆధారపడడం తగ్గించుకోవాలి. ప్రస్తుతం అమెరికా ఆంక్షలతో రొయ్య పిల్లలను తీసుకెళ్లడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులకు గిట్టు బాటు ధర కల్పించేలా హామీ ఇవ్వాలి.
చిన్నంసారధి, దినాస్ హేచరీ, ముక్కాం, భోగాపురం మండలం.
-------------