The chairmen of the market committees have been finalized మార్కెట్ కమిటీలకు చైర్మన్లు ఖరారు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:03 AM
The chairmen of the market committees have been finalized

మార్కెట్ కమిటీలకు చైర్మన్లు ఖరారు
ఒకేరోజు మూడు ఏఎంసీలకు సభ్యుల నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా ఏఎంసీలకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలో జిల్లాలో మూడు కమిటీలకు చోటు దక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులకు కమిటీల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను కేటాయించింది. రాజాం ఏఎంసీ చైర్‌పర్సన్‌గా జనసేనకు అవకాశం కల్పించింది.
విజయనగరం ఏఎంసీ చైర్మన్‌గా కర్రోతు
విజయనగరం రూరల్, ఏప్రిల్4(ఆంధ్రజ్యోతి):
విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గాజులరేగ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కర్రోతు నర్సింగరావు పేరు ఖరారు అయ్యింది. నర్సింగరావు టీడీపీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో ఆ పదవి సైలాడ త్రినాథ్‌కి దక్కింది. పదవి రాకపోయినా పార్టీ ఆదేశానుసారం కష్టపడి పనిచేశారు. కర్రోతు నర్సింగరావు సతీమణి ప్రస్తుతం కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని టీడీపీ తీసుకుని వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించింది. బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి డైరెక్టర్ల పదవులు దక్కాయి. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే అదితి చూసినట్లు తెలిసింది.
గజపతినగరం ఏఎంసీ చైర్మన్‌గా గోపాలరాజు
గజపతినగరం, ఏప్రిల్4(ఆంధ్రజ్యోతి): గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఎఎంసీ) చైర్మన్‌గా పాకలపాటి వెంకట విజయ గోపాలరాజు నియమితులయ్యారు. 1994లో రాజకీయప్రవేశం చేసిన గోపాలరాజు బీజేపీలో జిల్లా యూత్ అధ్యక్షుడి నుంచి 2018వరకు ఎన్నో పదవులను చేపట్టారు. 2018లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కొండపల్లి కుటుంబానికి విశ్వసనీయ అనుచరునిగా కూడా ఉన్నారు. ముగిసిన ఎన్నికల్లో శ్రీనివాస్ గెలుపు కోసం అహర్నిశలూ పనిచేశారు. గజపతినగరం ఏఎంసీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం ఆనందంగా ఉందని, రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినట్లు భావిస్తున్నానని గోపాలరాజు హర్షం వ్యక్తం చేశారు.
రాజాం ఏఎంసీ చైర్‌పర్సన్‌గా కృష్ణవేణి
జనసేనకు అవకాశం
రాజాం రూరల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటకు చెందిన పొగిరి కృష్ణవేణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా రాజాం ఏఎంసీని జనసేనకు కేటాయించింది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణవేణికి ఈ పదవి వరించింది. ఈమె జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్‌బాబు సతీమణి. మండల పరిధిలోని జిసిపల్లి వద్ద నెలకొల్పిన శ్రీలక్ష్మి గణపతి ఆగ్రో ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. బాబు గౌతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తుండగా పాప దీపిక ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌లో ఉన్నారు. భర్త సురేష్‌బాబు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పవన్‌కళ్యాణ్ ఆశయాలకు మెచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. రాజాంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈయన సేవల్ని గుర్తించిన జనసేన అధిష్టానం పిఠాపురంలో ఇటీవల నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు కాకినాడ ఇన్‌చార్జిగా నియమించారు.