Share News

reservoirs: జలాశయాలు బాగుపడేనా?

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:17 AM

reservoirs:జిల్లాలో జలాశయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో గేట్లు, చెక్‌డ్యామ్‌లు దెబ్బతిని నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా బయటకు పోతుంది.

reservoirs: జలాశయాలు బాగుపడేనా?
తాటిపూడి రిజర్వాయర్‌ గేట్ల ద్వారా నీరు వృథాగా పోతున్న దృశ్యం

- దెబ్బతిన్న గేట్లు.. ధ్వంసమైన చెక్‌డ్యామ్‌లు

- లీకులతో వేలాది క్యూసెక్కుల నీరు వృథా

- అధ్వానంగా సాగునీటి కాలువలు

- ప్రాజెక్టులపై గత వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం

- ప్రభుత్వంపైనే రైతుల ఆశలు

విజయనగరం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో జలాశయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో గేట్లు, చెక్‌డ్యామ్‌లు దెబ్బతిని నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా బయటకు పోతుంది. సాగునీటి కాలువలు కూడా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ ఈ ప్రాజెక్టులను గాలికి వదిలేసింది. బడ్జెట్‌ల్లో కనీస నిధులు కేటాయించేది కాదు. దీంతో మడ్డువలస, ఆండ్ర, వెంగళరాయసాగర్‌, తాటిపూడి రిజర్వాయర్‌ తదితర ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోలేదు. ఐదేళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ఏడాది వర్షాకాలంతో పాటు, నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు ఈ జలశయాల్లో నీరు ఎక్కువగా చేరింది. అయితే, లీకులతో ఈ నీరు చాలా వరకూ వృథాగా పోయింది. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ జలాశయాలపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.


మడ్డువలస జలాశయం..

QYNSLO_1696334639327_1.gif

వంగర మండలంలోని మడ్డువలస జలాశయం రెండో దశ పనులు నిలిచిపోయాయి. కాలువల ఆధునికీకరణ, ప్రధాన గేట్లు మరమ్మతులు తదితర పనుల కోసం గత ప్రభుత్వం రూ.18 కోట్లు విడుదల చేసింది. పనులు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు సక్రమంగా బిల్లులు చెల్లించపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గేట్ల లీకేజితో ప్రాజెక్టు నుంచి వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. దీంతో రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లోని పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. మడ్డువలస ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే సుమారు 30వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. తక్షణమే పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

నష్టపోతున్నాం..

మడ్డువలస ప్రాజెక్టులోకి పుష్కలంగా నీరు చేరుతున్నా లీకేజీలతో బయటకు వృథాగా పోతుంది. కాలువల్లో పూడికతీతలు చేపట్టకపోవడంతో సక్రమంగా నీరు అందడం లేదు. వేలాది రూపాయలు వెచ్చించి మోటార్ల ద్వారా నీటిని తోడుకుని కొంతమేర పంటలను కాపడుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అయినా త్వరితగతిన పనులు జరిపించి రైతులను ఆదుకోవాలి.

-బాలయ్య, రైతు, వంగర


లీకులమయంగా ఆండ్ర..

10vzp55.gifఆధునికీకరణకు నోచుకోని ఆండ్ర రిజర్వాయర్‌

మెంటాడ మండలంలోని ఆండ్ర ప్రాజెక్టు లీకులమయంగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రాజెక్టు గేట్ల నుంచి వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా చంపావతి నదిలోకి పోతుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, రైతులు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించుకోలేదు. గేట్ల మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత పనులు జరిపిస్తామని చెప్పి ఐదేళ్లు కాలం గడిపేశారు. ఫలితంగా ఆండ్ర ప్రాజెక్టు నుంచి నీరు వృథాగా పోతుంది. ఈ ఏడాది కూడా పంటలకు నీరు అందుతుందో? లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించాలని విన్నవిస్తున్నారు.

నెల్లిమర్లలో..

నెల్లిమర్ల మండలంలోని తిరుమలగెడ్డ, కొండవెలగాడ సీతమ్మ చెరువు, చంపావతి బ్యారేజీ నుంచి కుమిలి ప్రాంతంలోని పలు గ్రామాల్లో పొలాలకు సాగునీటిని అందించే కుమిలి చానల్‌ అధ్వానంగా తయారైంది. పూడికతీత పనులు చేపట్టకపోవడం, మదుములు బాగు చేయకపోవడంతో ఆయా కాలువల్లో చుక్కనీరు కూడా ఉండడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


బొబ్బిలిలో..

బొబ్బిలి ప్రాంతంలో కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్వీర్యమ య్యాయి. మండలంలో అనేక గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. వాటి నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు కూడా లేవు. ఈ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించడంతో పంట కాలువలకు శాపమైంది. పిరిడి చానల్‌కు సంబంధించి సమస్య ఉంటే, ఎమ్మెల్యే బేబినాయన తన సొంత నిధులను ఖర్చు చేసి కాలువను బాగు చేయడంతో గత ఖరీఫ్‌ సీజన్‌ గట్టెక్కింది. ఈ ఏడాది కూడా కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటిని బాగుచేసి పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.20 లక్షలు నిధులు అవసరం. దీనిపై అధికారులు దృష్టి సారించి సకాలంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి, ఆయా పనులు మంజూరు చేస్తే, ఖరీఫ్‌నకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు అంటున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

పిరిడి, పెంట కాలువల రెండింటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. గున్నతోటవలస సోములు చెరువుకు గొలుసు కట్టుగా ఉంది. దానికి నీరొచ్చే మార్గం మూసుకుని పోయింది. చానల్‌ గేట్లు పోయాయి. రామజోగి చెరువు మీద నుంచి నీరు వచ్చేలా ఏర్పాటు చేయాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.

-చొక్కాపు నారాయణరావు, రైతు


తాటిపూడి రిజర్వాయర్‌..

గంట్యాడ: తాటిపూడి రిజర్వాయర్‌ గేట్ల నుంచి సాగునీరు వృథాగా పోతుంది. సిల్ప్‌వే నుంచి నీరు లీకు అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నీరు వృథాగా పోతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. రిజర్వాయర్‌కు నాలుగు గేట్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. మరోవైపు రిజర్వాయర్‌ పరిధిలోని కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాటు పూడికతీతలు చేపట్టకపోవడంతో సాగునీరు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల చివరి ఆయకట్టుదారులు అవస్థలు పడుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి గేట్ల మరమ్మతులు, కాలువల ఆధునికీకరణకు నిధులు మంజూరు కావడం లేదు. ఈ ప్రభుత్వమైనా నిధులు మంజూరు చేసి తమ సాగునీటి కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.

లీకులు అరికట్టాలి

తాటిపూడి రిజర్వాయర్‌ సిల్ప్‌వే నుంచి సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల అత్యవసర పరిస్థితిలో సాగునీరుకు కష్టం వస్తుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సిల్ప్‌వే బాగు చేయాలి. అలాగే కాలువల్లో పూడిక ఆధికంగా ఉంది. వేసవిలో ఈ పూడికను తొలగిస్తే సాగునీరు విడుదల చేసినప్పుడు ఇబ్బందులు ఉండవు.

-ఎర్నినాయుడు, పీఎస్‌ఆర్‌పురం, రైతు

Updated Date - Apr 12 , 2025 | 12:17 AM