Share News

obstacles ‘ఆట’ంకాలు తొలగేనా?

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:16 AM

Will the obstacles be removed? జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదవే లేదు. అయితే వారికి అవసరమైన క్రీడా ప్రాంగణాలు, శిక్షణలు ‘మన్యం’లో లేవు. దీంతో వారు పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో గిరిజన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  obstacles  ‘ఆట’ంకాలు తొలగేనా?
గుమ్మలక్ష్మీపురంలో ఇండోర్‌ స్టేడియం ఇలా..

స్టేడియంల నిర్మాణం కాగితాలకే పరిమితం

మధ్యలో నిలిచిపోయిన క్రీడా ప్రాంగణాల పనులు

దృష్టి సారించని గత వైసీపీ సర్కారు

పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్న క్రీడాకారులు

రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదవే లేదు. అయితే వారికి అవసరమైన క్రీడా ప్రాంగణాలు, శిక్షణలు ‘మన్యం’లో లేవు. దీంతో వారు పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో గిరిజన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ప్రోత్సహించే వారే కరువయ్యారు. వాస్తవంగా జిల్లా ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా.. క్రీడాభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, అర్ధాంతరంగా నిలిచిన స్టేడియం పనుల పూర్తిగా నిధులు మంజూరు చేయలేదు. దీంతో కొన్నాళ్లుగా క్రీడాకారులకు ‘ఆట’ంకాలు తప్పడం లేదు. ప్రస్తుతం వారంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ‘మన్యం’లో క్రీడాభివృద్ధిని పరుగులు పెట్టించాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి ...

- ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో సీతంపేట కేంద్రంగా 2018లో క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. అది మినహా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు జిల్లాలో తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ లేవని చెప్పొచ్చు.

- కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం ఆర్‌ఆర్‌బీ పురం వద్ద 2005లో తొమ్మిది ఎకరాల 30 సెంట్లు రెవెన్యూశాఖ ద్వారా క్రీడా శాఖకు అప్పగించారు. వాటి పనులు చేపట్టేందుకు అప్పటి ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ సుమారు రూ.22 లక్షలు మంజూరు చేశారు. 400 మీటర్లు అథ్లెటిక్‌ ట్రాక్‌ ఫీల్డ్‌, వాలీబాల్‌, కబడ్డీ , ఖోఖో తదితర క్రీడలకు వీలుగా ప్రాంగణ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు గాలిలోనే కలిసిపోయాయి. 2006, ఏప్రిల్‌ 6న పంపిన ప్రతిపాదనలు మేరకు అప్పట్లో రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఎంపీ ఫండ్స్‌ , ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. ఏడు లక్షలు, లోకల్‌ కంట్రీబ్యూషన్‌గా డిపార్ట్‌మెంట్‌ ద్వారా మరో రూ. ఏడు లక్షలు సమకూర్చుకోవాలని స్టేట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ అప్పట్లో ఆదేశించింది. కానీ ఆ దిశగా చర్యలు లేకపోవడంతో మంజూరైన రూ.ఐదు లక్షలతోనే చిన్న చిన్న పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఆ క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారడంతో దాని కోసం భూములిచ్చిన రైతులు, మరోవైపు క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆర్‌ఆర్‌బీ పురంలో క్రీడా ప్రాంగణం నిర్మాణం కాగితాలకే పరిమితమైంది.

- 2016- 2017లో గుమ్మలక్ష్మీపురం మండలంలో సుమారు రూ. రెండు కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 16/2, 16/3 ఏ, 17/2 తదితర సర్వే నెంబర్లలో పది ఎకరాల ఐదు సెంట్లను కేటాయించారు. 400 మీటర్ల అథ్లెటిక్‌ ట్రాక్‌ ఫీల్డ్‌ నిర్మాణంతో పాటు ఇతరత్రా పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ఐటీడీఏ నిధులు మంజూరు చేశారు. నిర్మాణ బాధ్యతను ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పటించారు. అయితే సుమారు 30 శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత వివిధ కారణాలతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తవకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

- సాలూరు పట్టణంలోని వీఆర్‌ఎస్‌ కాలనీలోని ఇండోర్‌ స్టేడియం పూర్తిగా పాడైంది. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాస్తవంగా ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎంతోమంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. అయితే ప్రస్తుతం స్టేడియం శిక్షణలకు అనువుగా లేదు. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో క్రీడాకారులు అటువైపు వెళ్లేందుకు సాహించడం లేదు.

క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణానికి అడుగులు

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. ముందుగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని గత ఏడాది జిల్లా పర్యటనకు వచ్చిన క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. పార్వతీపురం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. సీతానగరం మండలం జోగింపేట వద్ద సర్వే నెంబర్‌ 10/2ఏలో పది ఎకరాలను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టనున్నాయి. దీనికి సంబంధించి డిటేయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాల్సి ఉంది. కాగా త్వరితగతిన పనులు చేపట్టి క్రీడా కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:16 AM