Share News

కల్యాణ వైభోగమే..

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:52 PM

జిల్లాలోని రామాలయాలు, భక్తాంజనేయ స్వామి ఆలయాలు, యువత ఏర్పాటు చేసిన పందిర్లలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

కల్యాణ వైభోగమే..
బైరాగిమఠంలో సీతారాముల కల్యాణం

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

శ్రీరామ నవమి వేడుకల్లో ప్రత్యేక పూజలు

జిల్లాలోని రామాలయాలు, భక్తాంజనేయ స్వామి ఆలయాలు, యువత ఏర్పాటు చేసిన పందిర్లలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కస్పా పెంటపాడులనో బైరాగిమఠం, కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి, ద్వారకాతిరుమలలో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయాల్లో భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు.

పెంటపాడు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఆహా చూసిన వారిదే కదా యోగం. ఇంకెవరికి కలుగుతుంది ఇంతటి మహాభాగ్యం. వేద మంత్రోచ్ఛరణ, బాజాభజంత్రీల నడుమ వైభవంగా సాగిన రాములోరి కల్యాణం వేలాది మంది తిలకించి పులకించారు. మండలంలోని కస్పా పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆంజనే యస్వామి ఆలయం వేదికగా ఆలయ అర్చకులు త్రిలోచనదాస్‌, పూర్ణచంద్ర త్రిపాఠి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాములోరి మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతూ సీతమ్మ మెడలో అర్చకులు అలంకరించారు. స్వామి వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హరి సూర్యప్రకాష్‌ తదితరులు స్వామి వారిని దర్శిం చుకున్నారు. ఆలయంలో వైకుంఠం ఏడు ద్వారా ల సెట్టింగ్‌ ఆకట్టుకుంది. కల్యాణం అనంతరం సుమారు 10 వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. సోమవారం స్వామివారి రథోత్సవం జరుగనుంది.

Updated Date - Apr 06 , 2025 | 11:52 PM