Share News

దొంగలొస్తారు తస్మాత్‌ జాగ్రత్త !

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:28 AM

వేసవి కాలం వచ్చేసింది. వడగాల్పులు ప్రారంభమ య్యాయి. ఉక్కపోత పెరిగింది. పగలంతా ఎండకు ఎండి వడగాల్పులకు అలసిపోయి సాయంత్రం సమయంలో వచ్చే చల్లగాలికి ఆరుబైట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

దొంగలొస్తారు తస్మాత్‌ జాగ్రత్త !
2018 ఏలూరు–శాంతినగర్‌లో న్యాయవాది ఇంటికి వచ్చిన చెడ్డీగ్యాంగ్‌.

వేసవి కాలంలో రెచ్చిపోతున్న దొంగలు

అర్ధరాత్రి వేళ తెగబడుతున్న ముఠాలు

ఏలూరు జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నంబరు 83329 59175కు సమాచారమివ్వాలి

– ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : వేసవి కాలం వచ్చేసింది. వడగాల్పులు ప్రారంభమ య్యాయి. ఉక్కపోత పెరిగింది. పగలంతా ఎండకు ఎండి వడగాల్పులకు అలసిపోయి సాయంత్రం సమయంలో వచ్చే చల్లగాలికి ఆరుబైట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది డాబాపైకి వెళ్లి నిద్రిస్తూ ఉంటారు. ఇంకొంత మంది బెడ్‌రూమ్‌లో ఏసీ, ఫ్యాన్లు వేసుకుని నిద్రిస్తూ ఉంటారు. ఆ ఏసీ, ఫాన్ల శబ్దాలకు బయట నుంచే వచ్చే శబ్దాలు తెలియవు. ఇదే అదునుగా దొంగలు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రెచ్చి పోతున్నారు. అయితే స్థానికంగా ఉండే దొంగల విధానం వేరు.. వీరు పగటి వేళ రెక్కీ నిర్వహించి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నవాటిని పరిశీలిస్తారు. సాయంత్రం సమ యంలో ఇళ్లల్లో లైట్లు వెలగడం కాని, బయట లైట్లు వెలగడం కాని లేకపోతే కచ్చితంగా వారు ఊరు వెళ్లారని గుర్తించి ఆ ఇంటిలో దొంగతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్న తెలగ పాముల ముఠా, చెడ్డీ గ్యాంగ్‌ వంటి ముఠాలు చాలా ప్రమాదకరమైనవి. వారికి తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పనిలేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా వారికి పనిలేదు. ఇది ధనవంతుల ఇల్లు అని అంచనా వేశారంటే కచ్చితంగా ఆ ఇంట్లోకి చొరబడతారు. ఇంటి తలుపును బద్దలకొట్టేస్తారు. మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడతారు. అవసరమైతే దాడులకు తెగబడతారు. ఈ ముఠాలు జిల్లాలో 2002లోనూ, 2004లోనూ, 2006లోనూ, 2014లోనూ, 2018లోనూ, 2021లోనూ చెడ్డీగ్యాంగులు, తెలగపాముల ముఠాలు వచ్చిన ఘటనలు ఉన్నాయి. 2004లో ఏలూరు మెయిన్‌బైపాస్‌ రోడ్డు, చొదిమెళ్ళ, చింతలపూడి రోడ్లులోని ఆర్టీవో ఆఫీసు సమీపంలోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లో వారిని బెదిరించారు. 2006లో జంగారెడ్డిగూడెం రోడ్డు, జోగన్నపాలెం బ్రిడ్జి సమీపంలో ఒక ఉద్యోగి ఇంట్లో చొరబడి దారుణానికి పాల్పడ్డారు. వృద్ధులను కట్టేసి చిత్రహిం సలకు గురిచేశారు. 2018లో ఏలూరు శాంతినగర్‌లోని న్యాయవాది సత్యనారాయణ ఇంట్లో ఒక చేపల చెరువుల వ్యాపారి అద్దెకు ఉంటుండగా అదేరోజు ఆయన కోట్ల రూపాయల నగదును రైతులకు ఇవ్వడానికి తీసుకువచ్చారు. మొత్తం మీద చడ్డీగ్యాంగ్‌ అర్ధరాత్రి వేళ 2018 మార్చి 23 రాత్రి 1.15 గంటలకు ప్రవేశించి ఎవరూ బయటకు రాకుండా తలుపులకు తీగలు చుట్టేశారు. అంతేకాకుండా వారి ఇంటి వద్ద మోటారు సైకిళ్లను తీసుకువచ్చి తలుపులకు కట్టేశారు. అలికిడి వచ్చిందని న్యాయవాది సత్యనారాయణ వెంటనే మేల్కొని సీసీ ఫుటేజీలో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల వారికి కూడా ఫోన్లు చేశారు. వారు వచ్చేసిరికి దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ ఆ చెడ్డీగ్యాంగ్‌ ఆచూకీ కానరాలేదు. ఏలూరు నగరం జాతీయ రహదారికి దగ్గరలో ఉండడంతో చెడ్డీ గ్యాంగ్‌ నగరంలోకి సులువుగా వచ్చి రాత్రి వేళ తప్పిం చుకు పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉండడంతో ఈ నేరాలు జరుగుతున్నాయని గుర్తించారు.

జిల్లా పోలీసులు భేష్‌

ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత నేరస్తులపై నిఘా పెంచారు. గతంలో జరిగిన దొంగతనాలు, ప్రస్తుతం జరిగిన దొంగతనాలు ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. సంక్రాంతి పండుగ రోజున బాధితుల ఇళ్లల్లో పండుగ వాతావరణం కనిపిం చేలా చోరీ సొత్తును రికవరీ చేసిన వాటిని బాధితులకు ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అప్పగించారు.

ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం

ప్రతిరోజు న్యూస్‌ పేపర్‌ వేయించుకునేవారు ఊరెళ్లే సమయంలో ఆ పేపర్‌ను ఆపేయమని చెప్పడం లేదా వేరేవారి దగ్గర ఇవ్వాలని చెప్పా లి. ఒకేసారి పేపరు ఓపెన్‌ చేయకుండా ఇంటి ముందు కనిపిస్తే కచ్చితంగా వారు ఊరులో లేనట్లు గుర్తిస్తారు. పాలప్యాకెట్ల పరిస్థితి ఇంతే. వాకిలి తుడవక పోవడం, ముగ్గులు లేకపోవ డాన్ని గమనిస్తారు. మనుషుల కదలికలు లేనివి గుర్తిస్తారు. బెడ్‌లైట్‌ అయినా ఆ ఇంటి ముందు వేసి ఉంచుకోవాలి. లోపల మరో బెడ్‌లైటు వెలిగేలా చూసుకోవాలి. బంధువులు, స్నేహితులనో ఆ ఇంటి వద్ద కాపలాడా ఉండ మనడమో లేదా రోజుకు ఒకటి రెండుసార్ల యినా వెళ్లి చూడమని చెప్పుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే 112కు గాని సమీప పోలీస్‌ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలి. లేదా జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 83329 59175కు సమాచారమివ్వాలి.

ఊరెళితే సమాచారమివ్వాలి

నేరాలు జరుగకుండా ముందస్తుగా విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచుకోవద్దు. వీలైనంత వరకు నగదు, వస్తువులు బ్యాంకు లాకర్లో ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. ఊర్లు వెళ్లేవారు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ సమాచారం ఇస్తే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరాను అమర్చుతారు. ఎవరైనా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకుంటారు.

– కిశోర్‌, ఎస్పీ, ఏలూరు జిల్లా

Updated Date - Apr 09 , 2025 | 12:28 AM