Share News

ఉగాది ఉత్సవం

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:57 PM

ఉగాది పచ్చడిలో తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగర ఎలా అయితే ఉంటాయో మన జీవితంలో వచ్చే మంచి, చెడులను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు.

ఉగాది ఉత్సవం
భీమవరం విష్ణు కాలేజీలో గోపూజ నిర్వ హిస్తున్న కలెక్టర్‌ నాగరాణి, ప్రముఖులు..


భీమవరం విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారిక కార్యక్రమం

పంచాంగ శ్రవణం.. పండితులకు సత్కారం

జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ

భీమవరం టౌన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ఉగాది పచ్చడిలో తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగర ఎలా అయితే ఉంటాయో మన జీవితంలో వచ్చే మంచి, చెడులను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు. ఆదివారం విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్‌కు వేద పండితులు, అర్చకులు స్వాగతం పలుకగా, గోమాతకు ఆమెతో పాటు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలు ప్రారంభించి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నరన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో అన్నివర్గాలకు అనుకూలంగా ఉందని ఈమని రామచంద్రాస్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. పలువురు కవులు కవి సమ్మేళనం నిర్వహించి ఆహుతులను ఉత్సాహపరిచారు. భీమవరా నికి చెందిన డి.రామనాగేశ్వర రావు, పంపన సాయిబాబు, చిర్రావూరి లక్ష్మీనారాయణ, కాళ్లకూరి శర్మ వేదికపై వారి చూపిన సాహిత్య పఠిమ ఆకట్టుకున్నాయి. చివరిగా కవులను, కళాకారులను, సంఘ సేవకులను మెమెంటో, సర్టిఫికెట్ను అందజేసి ఘనంగా సన్మానించారు. పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వాడవాడలా పంచాంగ శ్రవణాలు

జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించారు. పంచారామ క్షేత్రాలైన గునుపూడి సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివార్లను ప్రత్యేక అలంకరణ చేశారు. భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయానికి భక్తులు తరలిరావడంతో కిటకిటలాడాయి. మావుళ్లమ్మ ఆలయంలో వారణాశి లక్ష్మీ నర్సింహమూర్తిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రాత్రి స్వామివారికి సహస్రదీపాలంకరణ నిర్వహించారు. పలు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

అన్నీ అనుకూల ఫలితాలే..

జిల్లాలోని ఆలయాలతో పాటు పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటుచేసి పండితులను సత్కరించారు. విశ్వావసు నామ సంవత్సర ఫలాలను పండితులు తెలియజేశారు. ఈ ఏడాది రాజు సూర్యుడు అని, మంత్రి చంద్రుడు కావడంతో అన్నింటా శుభాలు జరుగుతాయని పంచాంగకర్తలు పేర్కొన్నారు. పంటలు సంవృద్ధిగా పండుతాయని, వర్షాలతో పాడిపంటలు బాగుంటాయన్నారు. ఈ ఏడాది ప్రతి రాశి వారికి శుభాలే జరుగుతాయన్నారు. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినా సర్దుకుంటా యన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:59 PM