ప్రభుత్వ భూమి కబ్జా
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:39 AM
ప్రభుత్వం ఏదైనా అధికార, ఆర్థిక బలం ఉంటే అడ్డుకునేది ఎవరంటూ స్థానిక వైసీపీ నేత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.

దొడ్డనపూడిలో వైసీపీ నేత హవా
చోద్యం చూస్తున్న అధికారులు
కాళ్ళ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏదైనా అధికార, ఆర్థిక బలం ఉంటే అడ్డుకునేది ఎవరంటూ స్థానిక వైసీపీ నేత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. చెరువు తవ్వకం చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని కాళ్ళ మండలం దొడ్డనపూడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారినా వైసీపీ నేత హవా కొనసాగుతోందని నాయకులు మండి పడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారని, కబ్జా వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకెళతామని గ్రామస్థులు చెబుతున్నారు.
మూడేళ్లుగా కబ్జా ప్రయత్నాలు
దొడ్డనపూడిలో ఆర్‌ఎస్ నెం. 205/1ఏ లో సుమారు 90 సెంట్లు, 1బీలో సుమారు 50 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిపై సరిహద్దు రైతు, వైసీపీ నేత కన్నువేశాడు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రెవెన్యూ అధికారుల అండతో తన పొలాన్ని చెరువుగా మార్చుకునే సమయంలో ఈ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశా డు. ఆ సమయంలో గ్రామస్థులు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తేవడంతో 2022 డిసెంబర్ 8న ‘దర్జాగా.. కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు కదిలారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మండ ల స్థాయి అధికారులు కబ్జా ప్రాంతాన్ని పరిశీలించి తవ్వకం పనులు నిలిపివేశారు. అప్పటికే మూడుసార్లు చెరువు తవ్వకానికి ప్రయత్నించారని తెలియడంతో మరొకమారు తవ్వితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అప్పటి తహసీల్దార్ టిఏ కృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడిన ‘ఆంధ్రజ్యోతి’కి అప్పట్లో గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
మరోసారి ఆక్రమణ యత్నం!
దాదాపు రెండున్నరేళ్లపాటు ఖాళీగా ఉన్న భూమిపై మరోసారి వైసీపీ నేత ఆక్రమణుఛ రంగం సిద్ధం చేశారు. స్థానిక అధికారులను ప్రసన్నం చేసుకుని పది రోజులుగా గట్లను ఎత్తు చేసుకునే పనిలో ఉన్నారు. రోడ్డున వెళ్లేవారికి పనులు కనిపించకుండా, ఎవరూ తన గట్టుకు రాకుండా ఒక గేటు ఏర్పాటు చేసి తాళం కూడా వేశాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటువైపు కూడా చూడడం లేదని గ్రామస్థులు మళ్లీ ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ అధికారులను వివరణ కోరడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకిరణ్, స్థానిక వీఆర్వో చిట్టిబాబు ఆక్రమణ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు నిలిపివేశారు. మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో గట్టు వేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. భూమిని గతంలోనే తాము కొనుగోలు చేశామని, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని సదరు నేత తెలపడంతో తహసీల్దార్‌కు చూపాలని అధికారులు తెలిపారు. ఇదే భూమిని గతంలో తవ్వుతుండగా ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు మూడుసార్లు నిలుపుదల చేయడం గమనార్హం. ఆన్‌లైన్ అడంగళ్‌లో ప్రభుత్వ పోరంబోకుగా ఉందని, దీనికి పట్టా ఎలా ఇచ్చారు..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో చెత్త వేసుకోవడానికి డంపింగ్ యార్డ్ లేదని, ఇలాంటి ప్రభుత్వ భూములను గ్రామ అవసరాలకు వినియోగించుకుంటే బాగుంటుందని కొంత మంది గ్రామస్థులు కోరుతున్నారు.
జాలిపూడి డ్రెయిన్‌పై ఆక్రమణలు!
ఏలూరు రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఏలూరులోని జాలిపూడి డ్రెయిన్‌పై ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఈ డ్రెయిన్ ద్వారా చాటపర్రు, జాలిపూడి, కాట్లంపూడి తదితర ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. కొన్నేళ్లుగా డ్రెయిన్‌పై ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. ఎవరికి అనువుగా వారు ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. వాహనాలు వెళ్లేవిధంగా చిన్న వంతెనలను సైతం నిర్మాణాలు చేపట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారు. జాలి పూడి డ్రెయిన్ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అడుగడుగునా చెత్తాచెదారం పేరుకుపోయి రబీ, ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూడు, చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించాలని, ఆక్రమణలను నిలువరించాలని రైతు సంఘాల నాయకులు ఆందోళన చేసినా ఫలితం లేదు. ఆక్రమణలపై అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.