హార్బర్‌పై కొత్త ఆశలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:34 AM
తీర ప్రాంతంలో దశాబ్దాల కాలంగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమవుతూ వస్తున్న వాటిల్లో ఒకటి బియ్యపుతిప్ప హార్బర్.

బియ్యపుతిప్ప వద్ద ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి
జిల్లా కలెక్టర్‌కు
సీఎం చంద్రబాబు ఆదేశం
గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనకే పరిమితం
నరసాపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి):
తీర ప్రాంతంలో దశాబ్దాల కాలంగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమవుతూ వస్తున్న వాటిల్లో ఒకటి బియ్యపుతిప్ప హార్బర్. ఇప్పటి వరకు ఈ పనులకు మూడుసార్లు శంకుస్థాపనలు జరిగినా నిర్మాణం మొదలు కాలేదు. ఏదో ఒక కారణంతో పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. అమరావతిలో ఇటీవల జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు హార్బర్ ప్రస్తావన తెచ్చారు. నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నాగరాణిని ఆదేశించడంతో మళ్లీ హార్బర్‌పై కొత్త ఆశలు చిగురించాయి.
రూ.13.50 కోట్లతో శంకుస్థాపన
రాష్ట్ర విభజన తరువాత బియ్యపుతిప్ప వద్ద బోట్లు ఆగేందుకు వీలుగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రతిపాదించారు. రూ.13.50 కోట్లతో చేపట్టే ఈ పనులకు 2019లో అప్పటి మంత్రిగా ఉన్న నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. భూసేకరణ, మట్టి ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ పనులను రద్దు చేసి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కాకుండా కార్గో పోర్టును నిర్మించాలని ప్రతిపాదించింది. సుమారు రూ.429 కోట్ల అంచనా వ్యయం చేపట్టే ఈ పనులకు 2022లో అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం జరగలేదు. మట్టి లెవెలింగ్ చేసి చేతులు దులుపుకున్నారు. పనులు జరగకపోవడంపై పలు వాదనలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రంలో ఎనిమిది హార్బర్‌లు నిర్మిస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. అందులో బియ్యపుతిప్ప హార్బర్ ఉంది. అన్ని నిర్మాణాలకు కేంద్రం ఓకే చెప్పి, దీనికి మాత్రం పచ్చజెండా ఊపలేదు. ఇందుకు బెంగళూరు నుంచి విచ్చేసిన టెక్నికల్ బృందం ఇచ్చిన నివేదికే కారణమన్న వాదన వినిపించింది. ప్రభుత్వం అధికారికంగా దీన్ని ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే హార్బర్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా.. పనులకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. తాజాగా సీఎం ఆదేశా లతో ఇప్పటి వరకు సేకరించిన భూమి, సర్వే లు, టెక్నికల్ బృందం రిపోర్టు తదితర ఫైళ్లను అధికారులు బయటకు తీస్తున్నారు. మళ్లీ నిపు ణులతో సర్వే చేయించి పనులు మొద లుపెడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.