ఏమార్చి..!
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:20 AM
ప్రభుత్వాన్ని ఏమార్చి అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలోని మిగులు ఉద్యోగులు. సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్‌కి రిపోర్టు చేయాలని నాడు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా నేటి వరకు పట్టించుకోలేదు. పదవీ విరమణ వయస్సు దాటిపోయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. ఈ విషయం ఎక్కడ బయటకు వచ్చి తాము ఇబ్బందుల్లో పడతామోనని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.

- ఆర్‌డబ్ల్యూఎస్‌లో మిగులు ఉద్యోగుల ఘనకార్యం
- అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు
- ఎస్‌ఎంపీసీకి రిపోర్టు చెయ్యకుండా తాత్సారం
- హైకోర్టు ఆదేశించినా కదలని సదరు ఉద్యోగులు
- పదవీ విరమణ వయస్సు దాటినా కొనసాగుతున్న వైనం
- ఆందోళనలో ఆ శాఖ ఉన్నతాధికారులు
ప్రభుత్వాన్ని ఏమార్చి అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలోని మిగులు ఉద్యోగులు. సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్‌కి రిపోర్టు చేయాలని నాడు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా నేటి వరకు పట్టించుకోలేదు. పదవీ విరమణ వయస్సు దాటిపోయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. ఈ విషయం ఎక్కడ బయటకు వచ్చి తాము ఇబ్బందుల్లో పడతామోనని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ శాఖల తరఫున ఉద్యోగులు వచ్చారు. ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు కూడా అప్పట్లో ఉద్యోగులు పలువురు వచ్చారు. వివిధ శాఖల్లో అదనంగా పనిచేస్తున్న 58 మందిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీరిని అప్పట్లో జిల్లా ఉపాధి కల్పనా శాఖ నేతృత్వంలో పనిచేసే సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్ (ఎస్‌ఎంపీసీ)కి బదలాయింపు చేసింది. ఈ ఉద్యోగులను ఆ తర్వాత వివిధ శాఖలకు కేటాయించింది. అనంతరం అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్ జరిగిన పొరపాటును గుర్తించి వారిని తిరిగి సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్ (ఎస్‌ఎంపీసీ)కు వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలపై అప్పట్లో సర్‌ప్లస్ ఉద్యోగులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో వీరికి చుక్కెదురైంది. ఉద్యోగులంతా రిపోర్టు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అప్పట్లో కలెక్టర్ పొరపాటు జరిగిందన్నదానికి కూడా ఓ పెద్ద కథే ఉంది. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అప్పటి ఉపాధి కల్పనాశాఖాధికారి అనధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారన్న వివాదం కూడా ఉంది. ఈ విషయం తెలిసి కలెక్టర్ తిరిగి వారిని సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఏదైనా ఆయా శాఖలకు కేటాయించిన సర్‌ప్లస్ ఉద్యోగులందరినీ తిరిగి ఎస్‌ఎంపీసీకి రిపోర్టు చేయమన్నది మాత్రం వాస్తవం.
కలెక్టర్ ఆదేశాలను దాచిపెట్టి..
అప్పట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు వచ్చిన 58 మంది ఉద్యోగులలో సింహభాగం అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు వెనక్కు వచ్చేశారు. సర్‌ప్లస్ మ్యాన్ పవర్ సెల్ (ఎస్‌ఎంపీసీ)లో రిపోర్టు చేశారు. కొన్ని శాఖల్లో పనిచేసే సిబ్బంది మాత్రం రిపోర్టు చెయ్యటానికి సిద్ధపడలేదు. కలెక్టర్లు మారటంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. ఇలా రిపోర్టు చెయ్యని ఉద్యోగుల్లో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విబాగంలోకి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. విజయవాడ సర్కిల్ కార్యాలయంలో పనిచే సే ఉద్యోగులలో ఒకరు కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా దాచారు. దీంతో చాలా ఏళ్లుగా ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా ఎస్‌ఎంపీసీకి రిపోర్టు చేయకుండా ఉండి పోయారు. మధ్య మధ్యలో ఎస్‌ఎంపీల నుంచి రిపోర్టులు కోరినా కూడా అవి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అనధికారికంగా చాలా కాలంగా ఆర్‌డబ్ల్యూఎస్‌లో మిగులు ఉద్యోగులు కొనసాగుతూ వస్తున్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు తెలిసినా.. అప్పటికే చాలా కాలం నుంచి ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే సర్‌ప్లస్ ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాలుగా హైకోర్టు నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సర్‌ప్లస్ ఉద్యోగులంతా కూడా కార్పొరేషన్ల పరిధిలో ఉన్నవారే కావటంతో 58 సంవత్సరాల వయస్సు వర్తిస్తుంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల గుండెల్లో బాంబు పేలినట్టు అయింది. ఎందుకంటే ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న వారు ఇప్పటికే పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ వయస్సు దాటినా ఇంకా కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారు.